లావణ్య త్రిపాఠి తాజా చిత్రంగా రూపొందిన ‘హ్యాపీ బర్త్ డే‘ ఈ రోజునే విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో లావణ్య మాట్లాడుతూ, ‘అందాల రాక్షసి’ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన పదేళ్లకు, మళ్లీ ఆ తరహాలో తన చుట్టూ తిరిగే కథను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. పైగా ఈ సినిమాకి మైత్రీ వారు ఒక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. దర్శకుడు రితేశ్ రానా కూడా కామెడీ కంటెంట్ ను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నమేదో చేసినట్టు అనిపించడం సహజం. అందువలన ఒకసారి వెళ్లొద్దాం అనిపిస్తుంది.
ఒక వైపున లావణ్య త్రిపాఠి .. మరో వైపున వెన్నెల కిశోర్ .. సత్య .. రాహుల్ రామకృష్ణ వంటివారు కనిపిస్తారు. అందరూ మంచి ఆర్టిస్టులే .. ఆ విషయంలో ప్రూవ్ చేసుకున్నవారే. కానీ కథలో కన్ఫ్యూజన్ ఎక్కువ .. ఏదీ ఒక పట్టాన అర్థం కాదు. తెరపై పాత్రలన్నీ హడావిడి చేసేస్తుంటాయి .. నవ్వించడానికే తెగ ప్రయత్నం చేస్తుంటాయి. కానీ నవ్వు తెచ్చుకుంటే వచ్చేది కాదు గదా .. దానంతట అది రాలేదంటే అక్కడ విషయం లేదని అర్థం. అయితే ప్రేక్షకుడు ఆశాజీవి .. ఇంకా ఏదో జరగబోతుందనే ఎదురుచూస్తూ ఉంటాడు.
దర్శకుడు ఆసక్తికరమైన కథను పకడ్బందీగా అల్లుకోలేదు. కొత్తదనమంటూ ఆయన వేసుకున్న స్క్రీన్ ప్లే అయోమయంగా అనిపిస్తుంది. ఇంతటి సిల్లీ సన్నివేశాల కోసమా ఇంతగా ఖర్చు పెట్టారు అనే ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ కి పెదాలు కాస్త విచ్చుకుంటాయి తప్ప .. ప్రేక్షకుడి ఎక్స్ ప్రెషన్ మాత్రం మారదు. కథ .. కథనం .. పాత్రలను తీర్చిదిద్దే విషయంలో గట్టి కసరత్తు జరిగుంటే, కొత్తగా చెప్పాలనే ప్రయత్నం కొంతవరకూ ఫలించేదేమో. అలాంటిదేం లేకుండా సాగే ఈ కథ చిరాకు పుట్టిస్తుంది. ఇంతోటిదానికేనా ఇంత హడావిడి చేసింది అనిపిస్తుంది.