రామ్ .. మంచి లవ్ స్టోరీతో తెలుగు తెరకి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. గులాబీ రంగులో కనిపించే ఈ కుర్రాడు, అమ్మాయి కలల రాకుమారుడు .. సుకుమారుడు. పట్టుమని ఓ పదిమంది రౌడీలు ఎదురుపడితే తమ హీరో వాళ్లని కొట్టలేస్తాడో లేదోనని టెన్షన్ పడిపోతారు. ఆ యాక్షన్ సీన్ అయిపోయేంతవరకూ అరచేతుల్లో ముఖాన్ని దాచేసుకుంటారు. తమకి కాబోయేవాడు రాముడంత కాకపోయినా రామ్ లా ఉండాలని వాళ్లంతా భావిస్తుంటారు.
కానీ రామ్ కి మాత్రం ఎంతకాలం ఇలా లవర్ బాయ్ సినిమాలు చేయాలి? ఇకనైనా మాస్ యాక్షన్ సినిమాలు జోరుగా చేసేయాలనే ఉత్సాహంతో ఉన్నాడు. దానికి తోడు ఆయన చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయింది. దాంతో ఇక ఆయనను పట్టుకోవడం కష్టంగానే ఉంది. ‘రెడ్’ సినిమాలోను మాస్ టచ్ ఉండేలా చూసుకున్న ఆయన, ఈ సారి ‘ది వారియర్’ కోసం మాస్ యాక్షన్ కి పోలీస్ ఆఫీసర్ పాత్రను సెట్ చేసుకున్నాడు. రామ్ కెరియర్ లో పోలీస్ ఆఫీసర్ గా చేయడం ఇదే మొదటిసారి. ఈ పాత్రలో ఆయన చెలరేగిపోవడం ఖాయమా అంటే ఖాయమే.
ఎందుకంటే రామ్ కి ఉన్న ఎనర్జీ లెవెల్స్ అలాంటివి. కాకపోతే .. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఊపేసే ఏజ్ ఆయనకి ఇంకా రాలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాస్త మొరటుగా .. కటువుగా కనిపించాలి. రామ్ చాలా సున్నితంగా .. సెన్సిటివ్ గా అనిపిస్తుంటాడు. నటన పరంగా ఆయనకి వంకబెట్టవలసిన పనిలేదు. కానీ పోలీస్ ఆఫీసర్ పాత్ర విషయంలో బాడీ లాంగ్వేజ్ .. లుక్ పరంగా మాత్రమే ఆలోచన చేయవలసి ఉంటుంది.
అందువల్లనే ఈ పాత్రకి ఆయన ఎంతవరకూ సెట్ అవుతాడు? అనే ఇక సందేహం చాలామందిలో ఉంది. మరి రామ్ ఆ విమర్శలను ఏ స్థాయిలో తిప్పికొడతాడనేది చూడాలి. ఈ నెల 14వ తేదీన తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రామ్ సరసన కథానాయికగా కృతి శెట్టి నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే.
Also Read : నేను కనెక్ట్ అయ్యాను.. అందరూ కనెక్ట్ అవుతారు : కృతి శెట్టి