రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 98,275 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 41వేల క్యూసెక్కులుగా ఉన్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1088.1 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 76.743 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా.. గరిష్ఠస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
శ్రీరాంసాగర్ నుంచి భద్రాచలం వరకు వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం నదిలో వరద ఉధృతి పెరుగుతున్నది. దీంతో అధికారులు భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలో భారీగా నీటిమట్టం పెరుగుతున్నది. భద్రాచలం వద్ద 53.1 అడుగులకు నీటిమట్టం చేరటంతో చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దిగువన ఉన్న మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం 13,80,071 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతం
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ప్రకటించింది. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని అధికారులు తెలిపారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. వచ్చే 3రోజులపాటు తెలంగాణలో భారీ వర్షంతో పాటు.. నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది