క్రూ లింక్ తరలింపును నిలిపివేసి, కాజీపేట వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసనగా తెలుపుతున్న తెరాస కార్యకర్తలపై కేంద్ర బీజేపీ సర్కారు ఆక్రమంగా కేసులు పెట్టిందని ఆరోపించారు. కాజీపేట రైల్వే గార్డ్ మరియు డ్రైవర్ల క్రూ లింక్ ను విజయవాడకు తరలించినందుకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ ముందు ఈ రోజు ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న వినయ భాస్కర్ మాట్లాడుతూ క్రూ లింక్ లను తరలించి రైల్వే డ్రైవర్ల పై కేంద్రం ప్రభుత్వం ఒత్తిడి పెంచుతుందని ఆరోపించారు. ప్రతిరోజు ట్రైన్ లలో లక్షలాది మంది ప్రయాణిస్తున్న రైల్లు నడుపుతున్న వారిపై ఒత్తిడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్న ప్రతి రైలు ఆగెలా అధికారులు చర్యలు తీసుకోవాలని వినయ భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం క్రూ లింక్ తరలింపు వెనక్కి తీసుకొనే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు. రైల్వే స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లకు వేసిన టాక్స్ ల రద్దుకై అనేక సార్లు జీయంని కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు.