Sunday, September 22, 2024
HomeTrending Newsరైతుల వాటా కేంద్రం, రాష్ట్రం భరించాలి: సిఎం

రైతుల వాటా కేంద్రం, రాష్ట్రం భరించాలి: సిఎం

Fasal Bima: ఫసల్‌ బీమా యోజన ఎక్కువమందికి వర్తించేలా విధానపరమైన మార్పుకు తీసుకు రావాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఫసల్‌ బీమా యోజనలో కొన్ని రాష్ట్రాలు ఎందుకు లేవన్న అంశంపై దృష్టిపెట్టి, ఆ మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేసేందుకు కృషిచేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి సిఎం ధన్యవాదాలు తెలియజేశారు.  ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా చేరుతున్న సందర్భంలో  కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌తోమర్, ఉన్నతాధికారులు  సిఎం జగన్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఈ వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఇటీవల కేంద్ర బృందం రాష్ట్ర పర్యటన సందర్భంగా సిఎం జగన్ ఫసల్ బీమాకు సంబంధించి కొన్ని అంశాలను ప్రతిపాదించారు. ఈ మేరకు… రైతులకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చేలా ఫసల్‌ బీమా యోజనలో మార్గదర్శకాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మార్పులు, చేర్పులు చేసింది.  ప్రకటించిన పంటల్లో రైతులందరికీ కూడా ఫసల్‌ బీమా వర్తించేలా మార్పులు చేసింది. ఇ–క్రాప్‌ వివరాలతో బీమా పథకానికి అనుసంధానించేందుకు అంగీకరించింది కేంద్రం.  వ్యవసాయ పద్ధతులు ఆధారంగా డేటా ఎంట్రీ చేసే విషయంలో సౌలభ్యతను తీసుకొచ్చింది.  ఈ మార్పులతో యూనివర్సల్‌ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ  ప్రస్తుతం రాష్ట్రంలో 10,444 ఆర్బీకేలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఆర్బీకేల పరిధిలో జరుగుతాయని వివరించారు.  అగ్రికల్చర్‌ అసిస్టెంట్, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లు ఆర్బీకేల్లో పనిచేస్తున్నారని, గ్రామ సచివాలయాలతో కలిసి ఆర్బీకేలు సమన్వయం చేసుకుంటున్నాయని తెలిపారు.   రైతులు సాగుచేసిన ప్రతి పంటను కూడా జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్‌ చేస్తున్నామని, రియల్‌ టైం డేటా సేకరిస్తున్నామని  పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సినదానితో పాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని….  మూడింట రెండొతులు ప్రీమియం రాష్ట్రమే భరిస్తోందని,  రైతు సాగుచేసిన ప్రతి పంటనూ ఇ–క్రాపింగ్‌ చేయడంద్వారా…. ఉచిత పంటలబీమా పథకం అద్భుతంగా ముందుకు సాగుతుందని సిఎం కేంద్ర బృందానికి తెలిపారు.  సన్న, చిన్నకారు రైతులు తరఫున చెల్లించాల్సిన ప్రీమియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటా భరిస్తే, మరిన్ని అద్భుతాలు జరుగుతాయని,  ఈ అంశంపై దృష్టిసారించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని జగన్ కోరారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనలో తిరిగి భాగస్వాములవుతున్నందుకు సీఎం వైయస్‌ జగన్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తొమర్‌  ధన్యవాదాలు తెలిపి స్వాగతం పలికారు.  రైతులు.. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనాలు కాపాడడంలో కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎం జగన్, ఇద్దరూ ఒకే లక్ష్యంతో పని చేస్తున్నారని ప్రశంసించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్