ఇండియన్ పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను తుత్తునియలు చేయడంతో నేడు జరిగిన మొదటి వన్డేలో ఇండియా ఘన విజయం సాధించింది. మరో పేస్ బౌలర్ షమీ కూడా మూడు వికెట్లతో రాణించాడు. మరో వికెట్ ప్రసిద్ కృష్ణ కు దక్కింది. లండన్ లోని కెన్నింగ్ టన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
జట్టు స్కోరు 6 వద్ద నుంచే ఇంగ్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. బుమ్రా తానువేసిన మొదటి ఓవర్లోనే జేసన్ రాయ్, జో రూట్ ఇద్దరినీ డకౌట్ గా వెనక్కు పంపాడు. ఆ తర్వాతి ఓవర్లో బెన్ స్టోక్స్ ను షమీ గోల్డెన్ డక్ గా పెవిలియన్ పంపాడు. జట్టు మొత్తంలో 30 పరుగులతో కెప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. డేవిడ్ విల్లే (21); మోయిన్ ఖాన్ (14); బ్రిడన్ క్రాస్ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మొత్తం జట్టులో నలుగు డకౌట్ గా వెనుదిరగడం విశేషం, 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది.
ఈ 111 పరుగుల విజయ లక్ష్యాన్ని వికెట్ నష్ట పోకుండా 18.4 ఓవర్లలోనే ఇండియా సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ-76; శిఖర్ ధావన్-31 పరుగులు చేశారు.
బుమ్రాకే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఇండియా 1-0తో ఆధిక్యంలో ఉంది.