Sunday, November 24, 2024
HomeTrending Newsకులమత సంకెళ్లతో పురోగమించలేం - కేటీఆర్

కులమత సంకెళ్లతో పురోగమించలేం – కేటీఆర్

కులమత సంకెళ్లలో చిక్కుకుంటే దేశం పురోగమించలేదని, మానవ సంపదైన యువతరం సెక్యులర్ భావాలతో ఎదగాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గ్రోత్ క్యారిడార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ లక్ష్మణ్ సంపాదకత్వంలో వెలువరించిన “చరిత్రపుటల్లో తెలంగాణ” గ్రంధాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ దూసుకుపోవాల్సిన సమయంలో కుల, మత ప్రస్తావనల్లో కొట్టుకపోతే అది దేశానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రపంచ చరిత్రలను అధ్యయనం చేస్తున్న విద్యార్థులు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో మానవత్వంపై దాడి జరుగుతున్నప్పుడు ఆలోచన పరులైన యువతరం స్పందించాలన్నారు. యువతరం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం వున్నదని, లేకపోతే కులం, మతం పేరుతో కొట్లాడుకునే విష వలయాలలో చిక్కుకుంటామని తెలిపారు.

దేశంలో ప్రస్తుతం మతం మత్తుమందులాగా తయారైందని, తెలంగాణ సమాజం యావత్తు జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. లేకపోతే జర్మన్ కవి చెప్పినట్లుగా హిట్లర్ కాలంలో నాజీలు మనకోసం వచ్చేవరకు కూడా మేల్కోలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మతం రాజకీయ పార్టీ ముసుగు వేసుకొని వస్తే అది దేశాన్ని గందరగోళ పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు పుడుతుంటారని, ప్రస్తుతం కేసీఆర్ ఎదురు తిరిగాడని, దేశమంతా ప్రశ్నించే గొంతులు పెరుగుతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్రను, పోరాటాన్ని, జరిగిన ఉద్యమాలు, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం, జాతరలు పండుగలు అనేకాంశాలను గ్రంథస్థం చేసిన ప్రొఫెసర్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, గ్రంధ రచయితలు ప్రొ. జి. లక్ష్మణ్, ప్రొ. మాదాడి వెంకటేశ్వరరావు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్