Saturday, November 23, 2024
HomeTrending Newsరాబోయే 24 గంటలు హైఅలర్ట్‌ : సిఎం ఆదేశం

రాబోయే 24 గంటలు హైఅలర్ట్‌ : సిఎం ఆదేశం

Be alert: వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోసం కోరినా యుద్ధ ప్రాతిపదికిన వారికి అందించాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విభాగాల కార్యదర్శులను ఆదేశించారు. సీఎంఓ కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని వెల్లడించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాకో సీనియర్‌ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే పూర్తి చేసిన అనతరం గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటుచేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, వైద్యం సహా అత్యవసర సేవలు, మందులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.  అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

సమీక్షలో సిఎం చేసిన సూచనలు

  • రేపుకూడా గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తోంది
  • వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలి
  • గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి, లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి
  • వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలి. గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
  • గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి
  • అవసరమైన పక్షంలో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇసుక బస్తాలు తదితర సమాగ్రిని సిద్ధంచేయండి
  • వీలైనన్ని ఇసుక బస్తాలను గండ్లుకు ఆస్కారం ఉన్న చోట పెట్టాలి
  • ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
  • వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి

  • బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోండి
  • ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించండి
  • 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలి
  • సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల రూపాయలు ఇవ్వాలి
  • రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి
  • అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు హెలికాప్టర్లను వినియోగించుకోండి

సీఎం ఆదేశాల మేరకు మొత్తం ఐదు వరద ప్రభావిత జిల్లాలకు 5గురు సీనియర్‌ అధికారులను సీఎస్‌ నియమించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా. బీ.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు మురళీధర్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రవీణ్‌కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌లను నియమించారు.

ఈ సమీక్షా సమావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయిప్రసాద్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర,  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read గోదావరి వద్ద మరింత పెరిగిన ఉధృతి  

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్