Saturday, November 23, 2024
HomeTrending Newsదేశ పురోగతిలో మహిళల పాత్ర కీలకం: ఉపరాష్ట్రపతి

దేశ పురోగతిలో మహిళల పాత్ర కీలకం: ఉపరాష్ట్రపతి

భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య తక్కువగా ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ…. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుని వారికి సాధికారత కల్పించే విషయంలో భాగస్వామ్య పక్షాలన్నీ యుద్ధ ప్రాతిపదికన కృషిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి, దేశ జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి) పెరగడంతోపాటు దేశం సమగ్ర పురోగతి సాధించేందుకు మహిళాశక్తి, పాత్ర అత్యంత కీలకమని, ఈ శక్తిని జాతి నిర్మాణంలో సద్వినియోగ పరుచుకునే దిశగా మరింత కృషి జరగాలని సూచించారు. మహిళలకు సాధికారత కల్పించకుండా ఏ దేశమూ సంపూర్ణ పురోగతి సాధించలేదనే విషయాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. ఇందుకోసం విద్యాసంస్థలన్నీ మహిళల కోసం నైపుణ్యాధారిత శిక్షణ అందించే దిశగా పాఠ్యప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలతో సమన్వయంతో పనిచేస్తూ వినూత్నమైన, మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా కొత్త కోర్సుల రూపకల్పనను ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.

లింగ వివక్ష సమాజంలో అతి పెద్ద సమస్యగా మారిందన్న ఉపరాష్ట్రపతి, దీన్ని పూర్తిగా నిర్మూలించే విషయంలో సమాజంలోని అన్ని వర్గాల ఆలోచనాధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. బాలురితోపాటు బాలికలను సమానంగా చూసే పరిస్థితి వచ్చినపుడే ఈ మార్పు సాధ్యమవుతుందన్నారు. ఈ దిశగా సమాజం ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ఆకాంక్షించారు.

భారతదేశంలో మహిళా సాధికారత ప్రాధాన్యతను నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి.. ‘ఇప్పటికే వివిధ రంగాల్లో మహిళలు తమ శక్తిసామర్థ్యాలను చాటుతున్నారు. అవకాశం దక్కినచోటల్లా తమ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలని తేడాల్లేకుండా మహిళలందరికీ నైపుణ్యాన్ని అందిస్తూ, వారికి సరైన అవకాశాలు కల్పించడం ద్వారా ఆత్మనిర్భర, నవభారత నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి’ అని అన్నారు. స్వాతంత్ర్యానంతర పరిస్థితుల్లో బాలికా విద్యకు సంబంధించిన విషయాల్లో సమయానుగుణంగా పురోగతి కనిపిస్తోందని, అయితే ఇది మరింత వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020) ప్రకారం 2035 నాటికి దేశంలో 100 శాతం బాలికలు పాఠశాలల్లో చేరడంతోపాటు ఉన్నత విద్యను, ప్రత్యేకమైన కోర్సులను నేర్చుకోబోతున్నారని, ఇది మనమంతా గర్వించాల్సిన అవసరమన్నారు. ఇందుకోసం ప్రతి భారతీయుడూ తనవంతు ప్రయత్నం చేయాలన్నారు.

విద్య అనేది కేవలం ఉపాధికల్పనకు మాత్రమే కాదని, జ్ఞానాన్ని, సాధికారతను పొందేందుకు కూడా విద్యాభ్యాసం ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. దీంతోపాటుగా వ్యక్తిత్వ నిర్మాణం, విలువలతో కూడిన జీవనాన్ని ప్రోత్సహించేటటు వంటి విద్యావిధానం మనకు అవసరమన్నారు. ఎన్ఈపీ-2020 ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం వేసిన ముందడుగన్నారు.

బాలికలు, యువతులు, మహిళలు కూడా తమ శక్తిసామర్థ్యాల విషయంలో ఎలాంటి అపోహలు లేకుండా ధైర్యంగా ముందుకెళ్లాలని, కొత్త విషయాలను నేర్చుకునే విషయంలో ఆసక్తి చూపించాలని అప్పుడే వ్యక్తిగతంగా ఎదిగేందుకు విస్తృతమైన అవకాశాలుంటాయన్నారు. ఈ సందర్భంగా మారిస్ స్టెల్లా కళాశాల యాజమాన్యాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యనందిస్తూ ఉన్నతమైన విద్యాప్రమాణాలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కేశినేని శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీ రావ్, విజయవాడ (తూర్పు) ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎఫ్ఎంఎం, ప్రిన్సిపల్ సుపీరియర్ రెవరెండం సిస్టర్ థెరిసా థామస్, ఆంధ్రప్రదేశ్ మహిళాశిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎ.ఆర్. అనురాధ, మేరిస్ స్టెల్లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జసింతా క్వాడ్రస్, బోధనా సిబ్బంది, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Also Read : తెలుగు భాష కళ్ళలాంటిది: వెంకయ్యనాయుడు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్