భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో చైనా బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. సిచుఅన్ ప్రావిన్సు లోని నైన్ గ్చి – టిబెట్ రాజధాని లాసా మధ్య ఈ రైలు ప్రారంభించారు. 435 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలు మార్గం ద్వారా చైనా భూభాగం నుంచి టిబెట్ సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు తొందరగా చేరేందుకు ఉపయోగపడుతుంది. క్లిష్టమైన హిమాలయాలు, అసాధారణ పరిస్థితులు ఉండే ఈ ప్రాంతంలో రైలు మార్గం పనులు, విద్యుదీకరణ చేయటం సాహసోపేతమైన చర్యగా చెప్పుకోవచ్చు.
భారత సరిహద్దులలో రక్షణ చర్యలకు ఈ రైలు మార్గం చైనాకు భౌగోళికంగా వ్యూహాత్మకమైనది. సిచుఆన్ రాజధాని చెంగ్డు నుంచి టిబెట్ రాజధాని లాసా కు చేరుకునేందుకు గతంలో 48 గంటల( రెండు రోజులు) సమయం పట్టేది. తాజా రైలు మార్గం ద్వారా కేవలం 13 గంటల్లో చేరుకోవచ్చు. నైన్ గ్చి పట్టణం మేడోగ్ నగరానికి చేరువలో ఉంటుంది. దీంతో చైనా పాలకులు, సైనిక బలగాలు నైన్ గ్చి నుంచి మేడోగ్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు చేరుకోవటం సులభతరమవుతుంది.
అరుణాచల్ ప్రదేశ్ టిబెట్లో అంతర్భాగమని చైనా ఎప్పటి నుంచో తప్పుడు వాదన చేస్తోంది. ఈ అంశంపై భారత్ – చైనా ల మధ్య దశాబ్దాలుగా విభేదాలు ఉన్నాయి. బుల్లెట్ రైలు ప్రారంభం నేపథ్యంలో ఇండియా అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో రెండు దేశాల మధ్య గొడవలు మరింత పెరిగే ఆస్కారం ఉంది.
ఇండియా సరిహద్దుల్లో చైనా వేగవంతంగా సౌకర్యాలు కల్పిస్తుంటే భారత పాలకులు ఈశాన్య రాష్ట్రాలను కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తు చేసుకుంటారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.