కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జూన్ 7న జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మార్గదర్శకాల ప్రకారం విదేశీ ప్రయాణం చేసేవారికి మొదటి, రెండవ టీకాల మధ్య విరామ సమయాన్ని 84 రోజుల నుండి 28 రోజులకు తగ్గించారని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్. జయపాల్ తెలిపారు. ఈ ఉత్తర్వులను తెలంగాణలో అమలుచేసి గల్ఫ్ కార్మికులకు 28 రోజులకే కోవిషీల్డ్ రెండో డోసు వేయాలని జయపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కొందరు గల్ఫ్ కార్మికులతో కలిసి శుక్రవారం జగిత్యాల జిల్లాలోని హెల్త్ సెంటర్ లలోని కోవిషీల్డ్ వాక్సిన్ కేంద్రాలను ఎన్. జయపాల్ సందర్శించి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ (కొత్తగా గల్ఫ్ కు వెళ్లేవారు & సెలవుపై గల్ఫ్ నుండి ఇండియాకు వచ్చినవారు) కు టీకా సేవలు ఏవిధంగా అందుతున్నాయో అధ్యయనం చేశారు.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం, విదేశీ ప్రయాణం చేసే వారికోసం కోవిషీల్డ్ రెండవ డోసు ఇవ్వడానికి, అవసరమైన సందర్భాలలో ఆధార్ తో పాస్ పోర్ట్ కు లింకు చేసి సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. తెలంగాణలో ఇలాంటి అధికారులను వెంటనే నియమించాలని జయపాల్ విజ్ఞప్తి చేశారు.
కోవిషీల్డ్ టీకాల విషయంలో గల్ఫ్ కార్మికుల సందేహాల నివృత్తి కోసం తమ యూనియన్ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిందని అవసరమైన వారు +91 94916 13129 నెంబర్ కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించాలని ఆయన తెలిపారు.