ఇంగ్లాండ్ తో జరుగుతోన్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా 62పరుగులతో ఘనవిజయం సాధించిచింది. వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన బెన్ స్టోక్స్ కు విజయంతో వీడ్కోలు పలకాలన్న ఇంగ్లాండ్ ఆశలు నెరవేరలేదు. సౌతాఫ్రికా బ్యాట్స్ మెంట్ వాన్ దర డస్సెన్ 133 పరుగులతో (117 బంతులు, 10ఫోర్లు) రాణించడంతో సౌతాఫ్రికా 333 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ 46.5 ఓవర్లలో 271 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
మూడు వన్డేలు, మూడు టి 20లు, మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది. దుర్హమ్ లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో జరిగిన మొదటి వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా 35పరుగులకు తొలి వికెట్ (డికాక్-19) కోల్పోయింది. ఆ తర్వాత డస్సెన్ – మలాన్ లు రెండో వికెట్ కు 106పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మలాన్ 57 స్కోరు చేసి ఔట్ కాగా… మార్ క్రమ్-డస్సెన్ లు మూడో వికెట్ కు 151పరుగుల మరో చక్కని భాగస్వామ్యం నెలకొల్పారు. మార్ క్రమ్ 77; డస్సెన్ 133 పరుగులు చేసి ఔటయ్యారు. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 333 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్ రెండు; శామ్ కరణ్, మోయిన్, కార్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ శుభారంభం చేసి తొలి వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జేసన్ రాయ్ 63 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ బెయిర్ స్టో కూడా (63) వెనుదిరిగాడు. జో రూట్ 77 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లతో 86 పరుగులు చేసి రాణించాడు. ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్ మెన్ నిలకడగా రాణించలేకపోవడంతో ఇంగ్లాండ్ కు ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో నార్త్జ్ నాలుగు; షంషి, మార్ క్రమ్ చెరో రెండు; కేశవ్ మహారాజ్, నిగిడి చెరో వికెట్ పడగొట్టారు.
వాండర్ డస్సెన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.