మొదటి నుంచి కూడా విక్రమ్ కుమార్ విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. కథ .. కథనం .. పాత్రల రూపకల్పన విషయంలో ఆయనకి మంచి అవగాహన ఉంది. టేకింగ్ విషయంలో కూడా ఆయన ఎవరినీ అనుసరించరనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. కథ ఏదైనా .. ఏ భాషలో చేస్తున్నా దానిపై ఒక రేంజ్ లో కసరత్తు పూర్తిచేస్తేనేగాని ఆయన సెట్స్ పైకి వెళ్లరు. ఆయన నుంచి కాస్త ఆలస్యంగా సినిమాలు రావడానికి కారణమదే.
విక్రమ్ కుమార్ ఎక్కువగా మాట్లాడరు .. తాను చేసిన సినిమాలను గురించి కూడా ఎక్కువగా చెప్పేసుకునే అలవాటు ఆయనకి లేదు. ‘ఇష్టం’ .. ‘ఇష్క్’ వంటి ప్రేమకథలు .. ‘మనం’ వంటి విభిన్నమైన కథాంశాలతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ’13బి’ వంటి సినిమాను చూస్తే ఆ జోనర్ పై కూడా ఆయనకి ఎంత పట్టు ఉందనేది అర్థమవుతుంది. ఇక ’24’ సినిమా .. దర్శకుడిగా ఆయన ప్రతిభాపాటవాలకు అద్దం పడుతుంది. తన సినిమాల విషయంలో ఆయన ఎంత కేర్ ఫుల్ గా ఉంటారనేది అర్థమవుతుంది.
అయితే కొంతకాలంగా ఆయన ఖాతాలోకి హిట్ వచ్చి చేరింది లేదు. తన మార్కు కొత్తదనం నుంచి ఆయన పక్కకి వెళ్లకపోయినా, సక్సెస్ మాత్రం పలకరించడం లేదు. ‘ హలో’ .. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ .. వంటి సినిమాల ఫలితాలు నిరాశపరిచాయి. చాలా గ్యాప్ తరువాత ఆయన చేసిన ‘థ్యాంక్యూ’ సినిమా ఈ నెల 22వ తేదీన థియేటర్లకు రానుంది. తెలుగులో ‘మనం’ తరువాత .. తమిళంలో ’24’ తరువాత ఆయన హిట్ మాటే వినలేదు. అందువలన ‘థ్యాంక్యూ‘ హిట్ కావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమాతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి మరి.