ధరల పెంపు, జిఎస్టీ పన్నుల అంశం పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా లోక్ సభలో విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. టిఆర్ఎస్ ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. గురువారం నాలుగొ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా లోక్ సభలో ధరల పెంపు, జిఎస్టీ పన్నుల అంశం పై చర్చకు విపక్ష పార్టీలు పట్టు పట్టాయి. టిఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు తీవ్ర స్థాయిలో చర్చకు పట్టుబట్టారు. దీనిపై స్పీకర్ అనుమతించలేదు. దాంతో టిఆర్ఎస్ పార్టీ సహా విపక్ష పార్టీల ఎంపిలు కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాయి. టిఆర్ఎస్ పార్టీతో లోక్ సభలోని విపక్షాలు కూడా కలిసి వచ్చాయి. టిఆర్ఎస్ పార్టీ తో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిఎంకె., ఎస్పీ, బిఎస్పీ., టిఎంసీ పార్టీలు కలిసి వాకౌట్ చేశాయి.
ఆ తర్వాత జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో అన్ని పార్టీలు ముక్తకంటంతో కేంద్రం తీరును తప్పు పట్టాయి. విచారణ సంస్థలను తమ అవసరాలకు అనుగుణంగా.. విపక్ష పార్టీల నేతలను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం వాడుతోందని నేతలు మండిపడ్డారు. 12 పార్టీల నేతలు కేంద్రం వైఖరి మారాలని డిమాండ్ చేస్తు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.