ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఇచ్చే మందులన్నీ డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని స్పష్టం చేశారు. కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు.
ఆస్పత్రి భవనాలు, వైద్య పరికరాల నిర్వహణపైనా దృష్టిపెట్టాలని, దీనికోసం ప్రత్యేక ఎస్‌ఓపీలను తయారు చేయాలని సిఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రోగులకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉండాలని, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరుపై కూడా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని నిర్దేశించారు.
మన రాష్ట్రం నుంచి ఏయే వైద్య చికిత్సల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నదానిపై ముఖ్యమంత్రి ఆరాతీశారు, క్యాన్సర్, గుండెజబ్బులు, చిన్నపిల్లల సర్జరీలకోసం అధికంగా వెళ్తున్నారని సిఎంకు వివరించారు అధికారులు. ఈ వ్యాధులకు వైద్యసేవలు ఇక్కడ హెల్త్ హబ్ లలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, స్పెషాల్టీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రాధ్యాన్యం ఇస్తున్నామని సిఎంకు అధికారులు తెలియజేశారు.
రాష్ట్రంలో కొత్తగా వస్తున్న 16, ఆధునీకరిస్తున్న 11 పాత వైద్య కళాశాల వల్ల ఆరోగ్యరంగం బలోపేతం అవుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. హెల్త్ హబ్ లు ఆవాసాలకు దగ్గరగానే ఉండేలా చూడాలని సిఎం విజ్ఞప్తి చేశారు.
ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం అన్నారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందాలని, 21 రోజులలో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, 104, 108 బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.