వరద బాధితులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. తాను వస్తున్నానని భయపడి వరద బాధితులకు 2 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పక్కన తెలంగాణా ప్రభుతం 10వేలు ఇస్తుంటే ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గతంలో తమ ప్రభుత్వ హయంలో వరదలు వస్తే పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి 10 వేలు, వస్తు సామాగ్రికి మరో 5వేల రూపాయలు ఇచ్చామని, ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి 50 వేల రూపాయలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కూడా నిర్మించి ఇచ్చామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల లో వరద బాధితులను పరామర్శించిన బాబు అనంతరం వారినుద్దేశించి మాట్లాడారు.
ఈ ప్రభుత్వ హయాంలో పోలవరం గోదావరి పాలైందని వ్యాఖ్యానించారు. పోలవరం పూర్తి చేసి ఉంటే గోదావరి జిల్లాలకు ఇంత స్థాయిలో వరద ముప్పు వచ్చి ఉండేది కాదన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఏదో అవినీతి జరిగిందని అబద్దాలు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ధనదాహం వల్ల డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వ అజాగ్రత్త, దూరదృష్టి లేని దాని వల్ల, స్పష్టత లేని కారణంగా, కంట్రాక్టర్ కు డబ్బులు ఇవ్వని కారణంగా పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరిగిందని చెబితే, తమ పార్టీపై ఎదురుదాది చేస్తున్నారని బాబు తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాంతంలో అనాదిగా చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్య కారుల కుటుంబాలు ఉపాధి లేక వలస వెళుతున్నారని బాబు అన్నారు.