A Writer Condemned The Ongoing Criticism About Prakash Raj Non Local Issue :
అతన్ని ఓడగొట్టడం
మన విద్యుక్త ధర్మం.
చిత్రసీమ రంగంలో
దేశంలో ఎక్కడా లేనట్టుగా
ఒక్క తెలుగు చిత్రసీమలోనే అతన్ని బ్యాన్ చేసి మన అసలైన స్వరం ఏమిటో ఎప్పుడో నిరూపించుకున్న వాళ్ళం మనం.
అతను మా’ ఎన్నికల్లో నిలబడడం అనే ఆలోచనతోనే ఎప్పుడో గెలిచేశాడు.
గెంటేసిన చోట స్థంభంలా నిలబడాలని
గేలి చేసిన చోటే గెలుపు గురించి ఆలోచించాలని,
వంచన నిర్లజ్జగా ఊరేగే చోటే దాని నడుం వంచాలని
చూశాడు చూడూ…
అతడప్పుడే గెలిచేశాడు.
ఇప్పుడు
‘మా’వోడు కాదని ప్రత్యేకంగా చాటింపు వేయాల్సిన అవసరం లేదు.
ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ నుంచి మణిరత్నం, ప్రియదర్శన్, సుకుమార్, గుణశేఖర్ వంటి ఎంతో మంది దర్శకులతో శభాష్ అనిపించుకున్నవాడు.
ప్రముఖ జర్నలిస్టు, హక్కుల కార్యకర్త గౌరీ లంకేష్ హత్య తర్వాత
దేశమంతా తిరిగి నిరసన గళం వినిపించినవాడు.
తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషా సాహిత్యాల్లో అభినివేశం ఉన్నోడు.
కళా పండితుడు,
నిత్య అధ్యయన పరుడు,
ప్రగతిశీల ఉద్యమాల ప్రేమికుడు.
ఐదు జాతీయ అవార్డులు,
ఆరు నంది అవార్డులు,
తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్,
సైమా అవార్డులు,
విజయ్ అవార్డులు …
ఇలా ఎన్నో పురస్కారాలు
గెలుచుకున్న విలక్షణ నటుడు.
అనేక అభ్యుదయ వేదికల మీద జనం కోసం మాట్లాడినవాడు.
మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని,
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా బండ్లహత్తి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నవాడు.
విలక్షణ నటుడు,
నిర్మాత,
టెలివిజన్ ప్రెజెంటేటర్,
యాక్టివిస్ట్,
పొలిటీషియన్.
చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అనేక మంది ప్రముఖ హీరోలతో సినిమాల్లో పోటాపోటీ నటనతో అదరగొట్టినవాడు.
కళ పరమార్థం తెలిసిన వాడు. కళాకారుడు ఎవరి పక్షాన ఉండాలో తెలిసినవాడు.
2019 జనరల్ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి
28 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్నవాడు.
ఇప్పుడు అతని కులం వెతకాలి.
అతని మతం వెతకాలి.
అతని ప్రాంతం వెతకాలి.
అతని భావజాలం వెతికి మరీ ద్వేషించాలి.
అతను పరాయివాడు అని చాటి చెప్పాలి.
కళ గురించి ఎప్పుడూ సొల్లు ఉపన్యాసాలు ఇచ్చే చాలామంది మౌనంలో నిద్ర పోవాలి.
ఈ మౌనంతో తన కులానికో,తన ప్రాంతానికో, తమ మతానికో, తమ వర్గానికో మద్దత్తు ఇవ్వాలి.
లేదంటే ఇక్కడ మనుగడ వుండదు.
ఇదొక థియరీ.
తెలుగు సినిమాని ఫ్యూడల్ కులాన్ని పోగు చేసుకొనే పెంటదిబ్బగా మార్చేశారు.
ఫ్యూడలిజం మేట వేసిన కుగ్రామంగా దిగజార్చారు.
రెండు భాషలు కూడా రాని వాళ్ళు, కళలో ఓనమాలు కూడా తెలియని వాళ్ళు,
సినిమాలు లేక, రాక ఉబుసుపోని రాజకీయం చేసేవాళ్ళు,
అతని అనుభవం అంత వయసు కూడా లేని వాళ్ళు..
నిజానికి
అతని పోటీదారుడుగా భావించడమే వీళ్ళకి పెద్ద గౌరవం.
కులాలని సమీకరించుని,
తటస్థవాదుల మద్దతు బలవంతాన తెచ్చుకొని,
పోటీలో నిలిచి గెలవొచ్చు గాక.
ఇన్ని వత్తిడులు పెంచి
ఓట్లు గుంజుకుని
అతన్ని ఎలాగూ ఓడించవచ్చు. ఎందుకంటే అతను ‘మా’వోడు కాదు గనక.
అయితే భారతీయ సినిమా రంగం మీద అతని ముద్ర ఒకటి పదిలం చేయడం ద్వారా అతను ఎప్పుడో విజేత అయ్యాడు.
ఎంతోకొంత సత్యం మాట్లాడే వాళ్ళు,
దుర్మార్గ హింసని నిరసించే వాళ్ళు,
కొద్దోగొప్పో జనం పక్షాన ఉండే వాళ్ళు, కళాకారుల కష్టాలు..కన్నీళ్లు తెలిసిన వాళ్ళు
‘మా’కు అక్కర్లేదు.
మాకు కుట్రాజకీయాలే కావాలి.
కళాకారుల అసలైన సమస్యల గురించి ఆలోచించేవాళ్ళు,
వాటిని పరిష్కరించే ధ్యాస ఉన్న వాళ్లు “మా”కు అసలే వద్దు.
బోలెడు అభ్యుదయ కళాకారులు, కళా ఉద్యమాలు అతనిప్పుడు చూసి తప్పుకుపోతున్నారు.
దాని వెనక కారణాలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
డియర్ ప్రకాష్ రాజ్
నువ్
“మా’కు అవసరం లేదు.
-నూకతోటి రవికుమార్
(సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టు. నలుగురు చదవాల్సిన విషయం కాబట్టి రచయిత అనుమతి లేకపోయినా…యథాతథంగా)
Must Read : ప్రకాష్ రాజ్, నాగబాబులపై నరేష్ ఆగ్రహం