క్రీడల్లో పరాజితులు ఎవరూ ఉండరని, విజేతలు, భవిష్యత్ విజేతలు మాత్రమే ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. తమిళనాడులో జరుగుతోన్న 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ ను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఫిడే అద్యక్షుడు బర్కోరిచ్ తదితరులు పాల్గొన్నారు.
తమిళనాడులో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయని, వాటిపై చెక్కిన ఎన్నో శిల్పాలు పలు క్రీడలను ప్రతిబింబంగా నిలుస్తాయని మోడీ చెప్పారు. క్రీడలు తమ సంస్కృతిలో ఓ భాగంగా నిలుస్తున్నాయన్నారు.
అతిథిదేవోభవ అనేది భారతీయ మౌలిక సూత్రమని, దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో ఈ టోర్నమెంట్ ఇక్కడ జరగడం సంతోషకరమన్నారు. తమిళనాడు రాష్ట్రం ఎందరో గొప్ప చెస్ క్రీడాకారులను దేశానికి అందించిందన్నారు. టార్చ్ రిలే ను దేశవ్యాప్తంగా 75 నగరాల్లో ర్యాలీ నిర్వహించామని, 2700 కిలో మీటర్ల పాటు పయనించిందని చెప్పారు.