కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా స్వర్ణం బోణీ కొట్టింది. మీరాబాయి చాను మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మొత్తం 201 కిలోల బరువు ఎత్తి సత్తా చాటింది.
మీరాబాయి 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో 48 కిలోల విభాగంలో రజతం సాధించి పతకాల వేట మొదలు పెట్టింది. ఆ తర్వాత జరిగిన రియో ఒలింపిక్స్ లో విఫలమైనా 2017 లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం నెగ్గింది. 2018లో గోల్డ్ కాస్ట్ కామన్ వెల్త్ గేమ్స్ లో మీరాబాయి బంగారు పతకం సంపాదించింది. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించింది.
అదే జోరు కొనసాగిస్తూ నేడు మరో బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో వరుసగా రెండు సార్లు కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
మరోవైపు 55 కేజీల విభాగంలో మన దేశానికి చెందిన బింద్యా రాణి రెండో స్థానంలో నిలిచి రజతం ఖాయం చేసుకుంది, మొత్తం 202 కిలోల బరువు ఎత్తింది. పురుషుల 55 కిలోల విభాగంలో కూడా భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ సర్గార్ రజతం సాధించడం గమనార్హం.
ఇప్పటి వరకూ ఇండియా సాధించిన నాలుగు పతకాలూ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే కావడం విశేషం.
Also Read : అట్టహాసంగా కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభం