Saturday, November 23, 2024
HomeTrending Newsనేతన్న భీమా పథకం 7వ తేదీన ప్రారంభం

నేతన్న భీమా పథకం 7వ తేదీన ప్రారంభం

Netanna Bhima Scheme : నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని ఈ నెల 7 వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం రోజున అమలు చేయబోతున్నామని ప్రకటించారు. బీమా కాలములో లబ్దిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి ఐదు లక్షల రూపాయలను  అందచేస్తామన్నారు. లబ్దిదారులు చనిపోయిన పది రోజుల్లో ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక  ఇబ్బందులు ఉండకూడదన్న  ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

ఈ పథకం అమలుకు చేనేత మరియు జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందన్నారు. నేతన్న బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (LIC) తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదని కేటీఆర్ చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని ఎల్.ఐ.సికి చెల్లిస్తుందని తెలిపారు. ఇందుకోసం యాభై కోట్లు కేటాయించామన్న కేటీఆర్, 25 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేశామన్నారు. 60 సంవత్సరాల లోపు ఉన్న చేనేత, మరమగ్గాల కార్మికులందరూ ఈ నేతన్న బీమా పథకానికి అర్హులే అన్నారు.  సుమారు 80 వేల చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా కవరేజ్ లభిస్తుందన్నారు.  ఇక ఈ పథకమును అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. అర్హులైన చేనేత / పవర్ లూమ్ కార్మికులు, అనుబంధ  కార్మికులు అందరికి నేతన్న బీమా పథకాన్ని అమలుచేస్తామన్నారు కేటీఆర్.

చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఏ ప్రభుత్వము కేటాయించని విధంగా 2016-2017 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ (బీసీ వెల్ఫేర్ నుండి) రూ. 1200.00 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. చేనేత & జౌళి శాఖ రెగ్యులర్ బడ్జెట్ కు ఇది అదనం అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చేనేత జౌళి శాఖ సాధారణ బడ్జెట్  క్రింద రూ.55.12 కోట్లను కేటాయించామన్నారు. బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్ క్రింద స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో 400.00 కోట్లు కూడా కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేనేత కార్మికుల సంక్షేమం , ఉపాది కోసం ఈ క్రింది కార్యక్రమాలను అములచేస్తున్నామన్నారు కేటీఆర్.

1.చేనేత మిత్ర స్కీం:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, చేనేత కార్మికులకు ముడి సరుకుపై అనగా కాటన్, సిల్క్, ఉన్ని, నూలు మరియు రంగు రసాయనాల కొనుగోలుపై 40% రాయితీని/సబ్సిడీ ని కల్పించడం జరుగుచున్నది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10% రాయితీకి అదనం. ఈ 40% రాయితీలో 35% రాయితీ సబ్సిడీ డబ్బు చేనేత కార్మికుల మరియు అనుబంధ కార్మికుల వేతనాల పెరుగుదల రూపంలో నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలలోకి చేరు ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన 5% రాయితీ ముడి సరుకు కొనుగోలు దారులైన మాస్టర్ వీవర్స్ / వీవర్ సంఘాలకు / యూనిట్ల ఖాతాలకు విడుదల అగును.చేనేత మిత్ర పథకములో  ఇప్పటివరకు 20,501 మంది లబ్దిదారులు రూ.24,09,45,220/- సబ్సిడీని నేరుగా వారి ఖాతాలలోకి పొందారు.

నేతన్నకు చేయుత (త్రిఫ్టు ఫండ్ పథకము):

ఇంతకు పూర్వము ఉమ్మడి రాష్ట్రములో అమలు జరుగుచున్న సహకార త్రిఫ్ట్ ఫండ్ పథకములో చేనేత కార్మికులు వారి వేతనములో 8% పొదుపు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము తరపున 8% జమ చేయడం జరిగేది. ఈ పథకం కేవలం సహకార రంగములోని చేనేత కార్మికులకు మాత్రమే వర్తించేది. మన తెలంగాణ ప్రభుత్వము చేనేత కార్మికుడు చెల్లించే 8% త్రిఫ్టు పొదుపునకు రాష్ట్ర వాటాగా 16% జమ చేయడం జరుగుచున్నది . ఈ పథకమును 24.06.2017 లో పోచంపల్లిలో లాంచ్ చేయడం జరిగింది.  అప్పటినుండి నిర్విగ్నంగా సాగి, కోవిడ్ పాండమిక్ పరిస్థితుల్లో, చేనేత కార్మికులకు మేలు కల్పించుటకు G.O.Rt.No.58, Ind&Comm Dept., తేది. 19.06.2020 ద్వారా మూడు సంవత్సరముల లాకింగ్ పీరియడ్ కు వెసులుబాటు కల్పించడం ద్వారా 20,537 మంది చేనేత కార్మికులకు రూ.96.43 కోట్లు విడుదల చేయడం జరిగినది. ఈ మొత్తము వారికి కోవిడ్ పాండమిక్ పరిస్థితుల్లో చాలా ఉపయోగపడింది.ఈ పథకము చేనేత కార్మికుల మన్నన పొందినది మరియు వారి కోరిక మేరకు ఈ పథకమును తిరిగి మూడు సంవత్సరములకై ప్రభుత్వము పొడిగించి రూ.90.00 కోట్ల బడ్జెట్ ప్లాన్ తో తొలి సంవత్సరం రూ.30.00 కోట్లు కేటాయించినది. ఇప్పటివరకు ఈ పథకంలో 32,328 మంది చేనేత కార్మికులు చేరడం జరిగినది.

చేనేత కార్మికులకు ఋణ మాఫీ పథకం:

చేనేత కార్మికుల యొక్క సామాజిక మరియు ఆర్థిక బాగు కోసం ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలుతో పాటు, వారు పోటీ ప్రపంచములో సహేతుకమైన మార్కెట్ లేనందున సరియైన ధరలు రాక వారు బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించలేకపోవడం గమనించిన ప్రభుత్వం, వారిని ఋణవిముక్తులను గావించుటకు, ఋణమాఫీ పథకము అమలు పరిచినది. చేనేత కార్మికులు బ్యాంకుల నుండి చేనేత ఉత్పత్తులకై 01.04.2010 నుండి 31.03.2017 వరకు తీసుకున్న వర్కింగ్ కాపిటల్ వ్యక్తిగత లోన్స్ రూ.ఒక లక్ష వరకు మాఫీ చేయడం జరిగినది. ఇందులో 10,148 చేనేత కార్మికులు రూ.28.97 కోట్ల ఋణము నుండి విముక్తి అయ్యారు.

చేనేత రంగములో పరిశోధన మరియు అభివృద్ధి (R&D) బ్రాండ్ ప్రమోషన్ మరియు మార్కెటింగ్:

ఈ ప్రోగ్రాం క్రింద TSCO యందు ప్రత్యేక R&D విభాగము ఏర్పాటు చేసి, చేనేత రంగములో నూతన డిజైన్లు మరియు వస్త్రోత్పత్తి గురించి పరిశోధనలు మరియు మార్కెట్ గురించి అధ్యయనం జరుగుచున్నది. ఈ పథకం అమలుకై ఇంతవరకు రూ.284.92 లక్షలు విడుదల చేయడం జరిగింది. ఇట్టి పరిశోధనలో భాగముగా తెలంగాణలో ఒకప్పుడు బాగా ప్రాచుర్యము పొంది కాలక్రమేణా అంతరించిపోయిన చేనేత కళాకృతులను వెలికితీసి వాటికి నవీనరీతులలో జోడించడం జరుగుచున్నవి. తద్వారా TSCO “పీతాంబరి పట్టు చీరలు”, “ఆర్మూరు పట్టు చీరలు”, “హిమ్రా చేనేతలు”, “సిద్ధిపేట గొల్లభామ చీరలు” లాంటి ఒకప్పటి గొప్ప కళాకృతులను పరిశోధించి తిరిగి వెలికితీసి మనుగడలోనికి తీసుకురావడం జరిగినది. తదుపరి మహాదేవపూర్ ప్రాంత చేనేత కార్మికులచే “మహాదేవపూర్ టస్సార్ పట్టుచీరల” అభివృద్ధి చేయించడం జరిగింది. మరియు మన “రామప్పగుడి”కి ప్రపంచ వారసత్వ గుర్తింపు వచ్చిన కారణంగా ఒక “రామప్ప పట్టు చీరల” సిరీస్ ను కూడా ఈ పథకములో రూపొందించడం జరిగినది.

బతుకమ్మ చీరల ఉత్పత్తి:

రాష్ట్రములోని మరమగ్గాల మాక్స్ / ఎస్.ఎస్.వె. యూనిట్ల నుండి బతుకమ్మ చీరల ఉత్పత్తి జరుగుచున్నది మరియు ఈ చీరలను బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్రంలో 18 సం||లు నిండిన BPL మహిళలందరికి కానుకగా ఇవ్వడం జరుగుచున్నవి. ఈ పథకములో ప్రతిఏటా కోటి చీరల ఉత్పత్తి రాష్ట్రములోని మరమగ్గాలపై జరిపించి, యూనిట్ హోల్డర్స్, మరమగ్గాల కార్మికులకు పని కల్పించడం జరుగుచున్నది. వీరికి నిరంతరం పని కల్పించడంతో పాటు, వీరి నెలసరి ఆదాయము  రూ. 8,000/-, రూ . 12,000/-, రూ.16,000/-,  రూ. 20,000/- వరకు పెరిగింది.

మరమగ్గాల కార్మికులకు త్రిఫ్టు నిధి:

ఈ పథకములో మరమగ్గాల కార్మికులు తమ వేతనములలో 8% పొదుపు ఖాతాకు జమ చేసినచో, రాష్ట్ర ప్రభుత్వము తమ వాటాగా 8% డబ్బు జమ చేయును. ఈ పథకంలో మూడు సంవత్సరం లాక్ ఇన్ పీరియడ్ ను G.O.Rt.No.58, Dt.19.06.2020 ద్వారా వెసులుబాటు కల్పించడం జరిగి తద్వారా 4301 పవర్ లూమ్ కార్మికులకు రూ.12.07 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తము కోవిడ్ పరిస్థితుల్లో వారికెంతో ఉపయోగపడింది. ఈ పథకం చాలా జనరంజకమైన కారణంగా వారి అభ్యర్ధన మేరకు తిరిగి (౩) సంవత్సరాలు పొడిగించడం జరిగింది మరియు అదనపు బడ్జెట్ రూ.18.00 కోట్లు కేటాయించి, ఈ సంవత్సరమునకు రూ.10.00 కోట్లు మంజూరు చేయడం జరిగినది. చేనేత మరియు జౌళి రంగములపై ముఖ్యమైన ఫ్లాగ్ షిప్ స్కీములే కాకుండా ఈ క్రింది ముఖ్యమైన పథకాలు కూడా ఈ ప్రభుత్వ ము అమలు చేయుచున్నది.

చేనేత రంగములో

1) పావలా వడ్డీ పథకము

2) మగ్గముల ఆధునీకరణ పథకము

3) చేనేత వస్త్ర ప్రదర్శన

4) చేనేత రంగములో శిక్షణ మరియు మౌళిక సదుపాయాల కల్పనా

5) మార్కెట్ ఇన్సెంటివ్స్

6) హ్యాండ్లూం పార్కు గద్వాల

పవర్ లూం రంగములో

1) సిరిసిల్ల టెక్స్ టైల్ పార్కు

2) మినీ టెక్స్ టైల్  పార్కు వరంగల్

3) T -TAP  2017-2020

4) సిరిసిల్ల అప్పారెల్ పార్కు

5) వర్కర్-టు-ఓనర్ పథకం

6) మరమగ్గాల సేవా కేంద్రం ఏర్పాటు

7) మరమగ్గాలకు వినియోగించే విద్యుత్తు పై 50% సబ్సిడీ

8) మరమగ్గాల ఆధునీకరణ మొదలగునవి.

దేశంలో ఏ రాష్ట్రములో లేనివిధంగా చేనేత అభివృద్ధి, సంక్షేమము కొరకు తెలంగాణలో అమలవుతున్న వినూత్న పథకాలను పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ఒడిశా, కర్ణాటక , మధ్యప్రదేశ్ నుండి అధికారుల బృందాలు మన రాష్ట్రములో పర్యటించి, మన చేనేత పథకాలను అధ్యయనం చేసి ప్రశంసించాయని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్