కరోనా, మంకీపాక్స్ వంటి మహమ్మారులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అతలాకతలమవుతోన్న తరుణంలో చైనా, అమెరికాల మధ్య తైవాన్ వివాదం తారస్థాయికి చేరింది. అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించనున్నారనే వార్తల నేపథ్యంలో చైనా తీవ్రంగా స్పందించింది. తైవాన్‌లో నాన్సీ పెలోసీ పర్యటిస్తే.. తమ మిలిటరీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ సాదారణ సమావేశం సందర్భంగా డ్రాగన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్‌లో అమెరికా ప్రభుత్వం తరఫున పర్యటిస్తున్న పెలోసీ మూడో వ్యక్తిగా చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.
దీనికి ప్రతిగా అమెరికా ఘాటుగా స్పందించింది. స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతోందని అమెరికా అంతర్గత భద్రతా మండలి స్పష్టం చేసింది. చైనా ఒంటెత్తు పోకడలు మానుకోవాలని యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ సమన్వయకర్త జాన్ కిర్బి వార్నింగ్ ఇచ్చారు. ఆసియాలోని నాలుగు దేశాల పర్యటనను నాన్సీ పెలోసీ సింగపూర్‌తో సోమవారం ప్రారంభించారు. ఈ రోజు స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ రాజధాని తైపే చేరుకొని వివిధ అంశాలపై ఆ దేశ ప్రభుత్వంతో చర్చిస్తారు. అమెరికా అధికార వ్యవస్థ వరుసలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల తరువాత ప్రజాప్రతినిధుల సభ స్పీకర్ ఉంటారు. దీంతో నాన్సీ పెలోసీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోన్న తరుణంలో తైవాన్‌లో సైతం పర్యటిస్తారన్న వార్తలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.
చైనా ప్రధాన భూభాగానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ దీవి చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం. 1949 నుంచి అది వివిధ కారణాలతో విడిగా ఉంది. 1971 వరకు చైనా అంటే ఐరాస, భద్రతా మండలిలో దాన్నే గుర్తించారు, వీటో అధికారం కూడా ఉంది. 1971 నవంబరు 15 నుంచి చైనా అంటే తైవానుతో సహా కమ్యూనిస్టుల ఆధిపత్యంలోని ప్రభుత్వమే అసలైన ప్రతినిధిగా ఉంది. తరువాత అమెరికా తైవాన్ను చైనాలో భాగంగానే గుర్తించినా… తైవాన్ పౌరులను ఒప్పించిన తరువాతే తప్ప బలవంతంగా విలీనం చేయకూడదంటూ అమెరికా మెలిక పెట్టింది.
Also Read : ఇప్పటికీ ముందంజలో “కెల్లాగ్ ఫ్లేక్స్”