భారత జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు జ్ఞానంగా నివాళులర్పించారు.
ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సిఎం జగన్ పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ప్రారంభించారు.
పింగళి వెంకయ్య స్వస్థలం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో మంత్రి జోగి రమేష్, నగరిలో మంత్రి ఆర్కే రోజా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పింగళి జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను పోస్టల్ శాఖ ఆవిష్కరించనుంది.
“దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా” అంటూ సిఎం జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.