హిమాచల్‌ప్రదేశ్ కులు జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. కుండపోతగా పడుతున్న వానలతో బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బియాస్ నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని అధికార యంత్రాంగం రక్షించింది. వరద ముప్పు ఉన్న 30 భవనాలను ఖాళీ చేయించారు. పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది బృందం మనాలి జిల్లాలోని 14 మైళ్ల ప్రాంతానికి సమీపంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. మనాలిలోని బహాంగ్ గ్రామంలో వరదల కారణంగా బియాస్ నది వెంబడి ఉన్న నివాస భవనాలను కులు జిల్లా యంత్రాంగం ఖాళీ చేయించగా, కొత్తగా నిర్మించిన రెండు తాత్కాలిక ఫుట్‌బ్రిడ్జిలు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.
మరోవైపు జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లా సూరన్‌కోట్ పట్టణంలో సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో అధికారులు విద్యాసంస్థలను మూసివేసి, అప్రమత్తంగా ఉండాలని కోరారు.