సీడ్స్ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణినిస్తోందని, , ప్రమాదానికి గల కారణాలు తెలిసేంతవరకూ కంపెనీని మూసి వేయాల్సిందిగా సిఎం జగన్ ఆదేశించారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ ఆవరణలోని సీడ్స్ పరిశ్రమలో మంగళవారం రాత్రి జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో అస్వస్థతకు గురై అనకాపల్లి వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం మంత్రి అమర్నాథ్ పరామర్శించారు. ఇతర ఆరోగ్య పరిస్థితులపై డి.ఎమ్ అండ్ హెచ్.ఓ హేమంత్, ఆస్పత్రి సూపరిండెంట్ శ్రావణ్ కుమార్ ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తిగా నయం అయ్యేవరకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. కంపెనీలో మంగళవారం రాత్రి వెలువడిన విషవాయువుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెలల వ్యవధిలోనే రెండోసారి రెండోసారి ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు. దాదాపు 121 మంది అస్వస్థతకు గురికావడం బాధాకరమన్నారు. ఈ విషయం తెలియగానే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం జగన్ ఆదేశించినట్లు అమర్నాథ్ తెలిపారు. గతంలో ఈ కంపెనీలో గ్యాస్ లీక్ అయినప్పుడు అందుకు గల కారణాలు తెలుసుకునేందుకు ఒక కమిటీని వేశామని, అందులో జిల్లా స్థాయి అధికారులు, పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారని చెప్పారు. ఈ కమిటీ సీడ్స్ నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించి పరీక్షించగా అందులో కాంప్లెక్స్ గ్యాస్ ఉన్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. పెస్ట్ కంట్రోల్ కు వాడే క్రిమిసంహారక మందు ఏసీ యంత్రాల్లో కి వెళ్లిందని ఏసీ యంత్రాలను వినియోగిస్తున్నప్పుడు అందులో నుంచి ప్రమాదకర వాయువు బయటకు వచ్చిందని దీనివల్ల అప్పుడు అక్కడ పనిచేస్తున్న కార్మికులు అస్వస్థతకు గురయ్యారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.
కమిటీ నివేదిక ఆధారంగా కంపెనీ యాజమాన్యానికి సెక్షన్ 41 కింద జూన్ 30న షోకాజ్ నోటీసులు జారీ చేశామని రెండు నెలల్లో ఈ నోటీసుకు సమాధానం ఇవ్వకుంటే ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. సంబంధిత యాజమాన్యం దీనిపై స్పందించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇదిలా వుండగా రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలపై ఉన్నతస్థాయి కమిటీ వేసి సేఫ్టీ ఆడిట్ జరిపిస్తామని చెప్పారు.