గత పాలకులది పెత్తందారీ పరిపాలన, పెత్తందారీ మనస్తత్వమని, తాము బాగుంటే చాలని వారు అనుకునే వారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అప్పట్లో దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతిలో డీపీటీ స్కీంను అమలు పరిచేవారని…. తమ ప్రభుత్వంలో డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) అమలు చేస్తున్నామని, నేరుగా బటన్ నొక్కుతున్నామని, లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తున్నామని వివరించారు, ఇప్పటివరకూ దాదాపు రూ.1.65 లక్షల కోట్లు రూపాయలు వివిధ పథకాల ద్వారా లబ్ధిచేశామన్నారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం అందించేందుకు జగనన్న తోడు పధకం అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా నేడు 3.95 లక్షలమందికి రూ. 395 కోట్ల రుణంతో పాటు గత ఆరునెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కూడా కంప్యూటర్‌లో బటన్ నొక్కి సిఎం జగన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, ఇతరుల మీద ఆధాపడే పరిస్థితి లేకుండా చేసేందుకే జగనన్న తోడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. చిరువ్యాపారులతో పాటు సాంప్రదాయ చేతివృత్తుల వారు తమకు బ్యాంకుల నుంచి రుణాలు రాక, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి అధిక వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక పడుతున్న బాధలను పాదయాత్రలో కళ్లారా చూశానని గుర్తు చేసుకున్నారు.
ఇటువంటివారి నడ్డి వరిచే ఈ వడ్డీల భారి నుంచి వీరిని తప్పించి, లక్షల కుటంబాలకు అండగా ఉండాలనే సంకల్పంతోనే ఈ పథకానికి రూపకల్పన చేశామని జగన్ స్పష్టం చేశారు. ఈ పథకానికి సహకరిస్తోన్న బ్యాంకర్లకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : ఇది కేంద్ర ప్రభుత్వం పథకం: అశోక్ బాబు