Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅటు మేమే...ఇటు మేమే

అటు మేమే…ఇటు మేమే

Helping ‘Hand’: ఆఫ్ఘనిస్థాన్ లో భార్య, పిల్లా జెల్లల గంపంత సంసారంతో హాయిగా కాపురముంటున్న అల్ ఖైదా అధిపతి అల్ జవహరిని అమెరికా గుట్టుచప్పుడు కాకుండా మట్టుబెట్టడం మీద అంతర్జాతీయ మీడియాలో అనేక ఆసక్తికర కథనాలు వస్తున్నాయి.

ఇంట్లో పది మందికి పైగా ఉండగా అతడొక్కడే చనిపోయేలా అమెరికా డ్రోన్ ఆధారిత హెల్ ఫైర్ ఎలా పనిచేసింది? విస్ఫోటనం, శబ్దం లేకుండా దాని ఆరు బ్లేడ్లు ఎలా పని చేస్తాయి? లాంటి సాంకేతిక అంశాలతో తెలుగు మీడియా కూడా అనేక వార్తలను వండి వార్చింది. మంచిదే.

ఈ లక్షిత దాడి గురి తప్పకుండా పని చేయడం వెనుక ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ అమెరికాకు ఎంత సహాయం చేశాయి? ఎందుకు సహాయం చేశాయి? ఎలా సహాయం చేశాయి? అన్న విషయాలు మాత్రం మన మీడియాకు పట్టలేదు.

ఆఫ్ఘానిస్తాన్ పునర్నిర్మాణానికి భారత్ కూడా సహాయం చేసింది. అలాంటి ఆఫ్ఘన్ ఏకంగా అల్ ఖైదా అధిపతిని ఇన్నేళ్లుగా కడుపులో పెట్టుకుని కాపాడ్డం భారత్ కు కూడా మింగుడుపడడం లేదు.

అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల నిపుణుల సందేహాలు, సమాధానాలు ఇవి:-

1. ఆఫ్ఘన్ కాబూల్లో అత్యంత సంపన్నులు నివాసముండే ప్రాంతంలో జవహరి తలదాచుకుంటున్నాడు అంటే…ఆఫ్ఘన్ ప్రభుత్వ సహకారం లేకుండా ఇది సాధ్యమా?
2. అదే ఆఫ్ఘన్ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి అమెరికా సహాయం కోరుతోంది. అందులో భాగంగా జవహరి కాపురం, దిన చర్యలను అమెరికాకు చెప్పకపోతే…రోజూ తప్పనిసరిగా ఉదయం ఆరున్నరకు ఎండలో సూర్యకిరణాల ఆరోగ్య డి విటమిన్ కోసం క్రమం తప్పని అలవాటుగా తిరిగే జవహరి మీదే హెల్ ఫైర్ ను అంత ఖచ్చితంగా ఎలా ప్రయోగించారు?

Ayman Al Zawahari
3. ఆఫ్ఘన్ లా పాకిస్థాన్ కూడా ఐ ఎం ఎఫ్ మరేవేవో రుణాలకోసం అమెరికా కాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి హెల్ ఫైర్ ను మోసుకెళ్లే మానవరహిత డ్రోన్ పాకిస్థాన్ ఎయిర్ స్ట్రిప్ నుండి ఎగరడానికి అనుమతించింది.
4. ఉగ్రవాద మూకలను పెంచి పోషించడం, స్థావరాలకు రక్షణ కల్పించడంలో…తమ అవసరాలకోసం వారి కదలికలను అమెరికాకు చెప్పడంలో పాకిస్థాన్- ఆఫ్ఘానిస్తాన్ తోడు దొంగలు.
5. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు ఉగ్రవాదులు పాక్- ఆఫ్ఘన్ ప్రభుత్వాలను నమ్ముతూ ఉంటారు. ఇలా హెల్ ఫైర్లకు దొరికిపోతూ ఉంటారు.
6. అమెరికా కూడా మనతో కంచంలో పంక్తి భోజనం తింటున్నట్లు నటిస్తూనే…అదే సమయంలో పక్కన పాకిస్థాన్ లో చికెన్ బిర్యానీ…అదే సమయంలో ఆఫ్ఘన్ లో కాబుల్ కబాబ్ తింటూ ఉంటుంది.


7. అల్ జవహరి చావు ఉగ్రవాదం మీద పోరులో భాగమే కానీ…అంతం కాదు. అల్ ఖైదా అంతర్జాతీయంగా బలహీనపడడంతో ఇప్పుడు అందులో మిగులు అంతా ఐసిస్ లోకి వెళ్లి…ఐసిస్ బలపడుతుందని ఒక ఆందోళన అప్పుడే మొదలయ్యింది.
8. ఇవన్నీ మనకు సంబంధం లేని విషయాలు కానే కాదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు సంబంధం ఉన్నవే.
9. ఒకటి మాత్రం నిజం. ఆఫ్ఘన్ జవహరి ఆచూకీ చెప్పకుంటే, సహాయం చేయకుంటే, పాకిస్థాన్ ఎయిర్ స్ట్రిప్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వకుంటే అమెరికా హెల్ ఫైర్ బ్లేడ్లు గడ్డం గీసుకోవడానికి కూడా పనికొచ్చేవి కాదు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఆఫ్ఘన్ పాపంలో ఎవరి వాటా ఎంత?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్