శివసేన పార్టీ మాదంటే మాదని ఏక్‌నాథ్, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు వాదిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమదే అసలైన శివసేన అంటూ, విల్లు-బాణం గుర్తు తమకే కేటాయించాలంటూ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీం ఆదేశించింది. దీనిపై ఠాక్రే వర్గం ప్రతిస్పందన తెలపడానికి సమయం కోరితే, వారి అభ్యర్థన పరిగణనలోకి తీసుకోవాలని, వారి వాదన విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మహారాష్ట్రలో చోటుచేసుకున్న పరిణామాలపై కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా, వద్దా అన్న అంశంపై ఆగస్టు 8వ తేదిన సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది.
ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమదంటే తమదేనని ఏక్‌నాథ్, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. దీంతో శివసేన పంచాయతీ కేంద్ర ఎన్నికల సంఘం వరకూ వెళ్లింది. రెండు వర్గాల నేతలు శివసేన పార్టీ తమదేనని ఈసీకి లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌సభ ఎంపీల్లో 12 మంది తమకు మద్దతుగా ఉన్నారని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఎలక్షన్ సింబల్స్ ఆదేశం 1968 ప్రకారం శివసేన పార్టీ గుర్తు విల్లు ధనుస్సు తమకే కేటాయించాలని కోరారు.
దీంతో ఈసీ.. ఏక్ నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. శివసేన పార్టీకి ఎవరు సారథ్యం వహించాలో చెప్పే ఆధారాలు, రుజువులను డాక్యుమెంటరీ రూపంలో తమకు సమర్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే ఆధారాలనూ తమకు సమర్పించాలని ఆదేశించింది. ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం వరకు అన్ని ఆధారాలు, డాక్యుమెంట్లను సమర్పించాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం, ఈసీకి పలు ఆదేశాలు జారీ చేసింది.