తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పది మంది జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశానని తెలిపారు. కాంగ్రెస్‌లో తనకు అంచెలంచెలుగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చారని ఆయన తెలిపారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమనే తాను నమ్ముతానని ఆయన తెలిపారు. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌లో పనిచేసుకుంటూ వచ్చానన్నారు.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణగతొక్కుతున్నారంటూ పేర్కొన్నారు. వ్యాపార, రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నారని దాసోజు విమర్శించారు. రేవంత్ తప్పు చేస్తే అడిగే వారే లేరన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. సర్వేల పేరుతో అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇచ్చి మోసం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి, సునీల్, మాణిక్కం ఠాగూర్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
ఎఐసిసి నుంచి టీపీసీసీ ని ఫ్రాంచైజ్ గా తాను తెచ్చుకున్నట్టు రేవంత్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్ ఎవరికి దొరకడని, రేవంత్ దగ్గర ఎల్ 1,ఎల్ 2, ఎల్ 3 , ఎల్ 4 దర్శనాలు ఉంటాయని ఆరోపించారు. మాఫియాను నడిపినట్టు పార్టీ నడిపిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే… కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లుగా వార్తలు వినిపించిన వెంటనే ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో శ్రవణ్ ఇంటికి పార్టీ సీనియర్లు కోదండరెడ్డి, మహేశ్ గౌడ్‌లతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపింది. అయితే వీరి బుజ్జగింపులకు శ్రవణ్ మెత్తబడలేదు. కోదండ రెడ్డి బృందం తన ఇంటి నుంచి వెళ్లిపోగానే… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శ్రవణ్ ప్రకటించారు.
Also Read : 21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ చేరిక