ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉభయసభల ఎంపీలు పార్లమెంట్ భవన్‌కు చేరుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీలు క్యూ లైన్‌లో నిలుచున్నారు. అందరికంటే ముందే పోలింగ్ సెంటర్ వద్దకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. ప్రథమంగా ప్రధాని మోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ జర్గుతుంది. ఈ నెల 11వ తేదిన కొత్త ఉపరాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. జగదీప్ ధన్కర్ కు బిజెపితో పాటు జనతాదళ్ యు, YSRCP, బిఎస్పి, శివసేన AIADMKలు మద్దతు ఇస్తుండగా మార్గరెట్ అల్వాకు కాంగ్రెస్ తో పాటు డి.ఎం.కే, తెరాస, ఆప్, ఝార్ఖండ్ ముక్తి మొర్చా పార్టీలు మద్దతుగా ఉన్నాయి.
జగదీప్ ధన్కర్ వర్సెస్ మార్గరెట్ అల్వా.. ఈ ఇద్దరిలో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) అభ్యర్థి జగదీప్ ధన్‌కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా మధ్య పోటీ నెలకొంది. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కర్ బంపర్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్ష శిబిరంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉభయ సభలలో (లోక్‌సభ,రాజ్యసభ) 36 మంది ఎంపీలతో పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ. అయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అల్వా పేరును ప్రకటించకముందే ఏకాభిప్రాయానికి ప్రయత్నించలేదని టీఎంసీ ఆరోపించింది. దీంతో ఆ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది.