కామన్ వెల్త్ గేమ్స్ మహిళా క్రికెట్ లో ఇండియాకు రజతం లభించింది. నేడు జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (65), రోడ్రిగ్యూస్ (33) మినహా మిగిలినవారు బ్యాటింగ్ లో రాణించలేకపోవడంతో ఆసీస్ విసిరిన 162 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 9 వద్ద ఓపెనర్ హీలీ (7) వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కు మూనీ, కెప్టెన్ లన్నింగ్ లు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 36 స్కోరు చేసిన లన్నింగ్ రనౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన తహీలా మెక్ గ్రాత్ కేవలం రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరింది. గార్డెనర్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ తో 25 పరుగులు చేసింది. మూనీ 41బంతుల్లో 8ఫోర్లతో 61 పరుగులు చేసింది. చివర్లో హేన్స్ 10 బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్ తో 18 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగలిగింది.
ఇండియా బౌలర్లలో రేణుక సింగ్, స్నేహ్ రానా చెరో రెండు, దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత భారత జట్టు 22 పరుగుల వద్ద ఓపెనర్లు ఇద్దరి వికెట్లు (షఫాలీ వర్మ-11; స్మృతి మందానా-6) కోల్పోయింది. కెప్టెన్ హర్మన్, రోడ్రిగ్యూస్ మూడో వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోడ్రిగ్యూస్ 33 బంతుల్లో మూడు ఫోర్లతో 33; హర్మన్ 43 బంతుల్లో 7ఫోర్లు. 2సిక్సర్లతో 65 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత దీప్తి శ్రమ ఒక్కరే 13 పరుగులు చేసింది. మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. 19.3 ఓవర్లలో 152 వద్ద ఆలౌట్ అయ్యింది.
దీనితో ఇండియాకు రజతం దక్కింది.