Saturday, November 23, 2024
Homeతెలంగాణసిఎం కెసిఆర్ కు విపక్షాల అబినందనలు

సిఎం కెసిఆర్ కు విపక్షాల అబినందనలు

ప్రగతిభవన్ అఖిల పక్షం లో పాల్గొన్న పలు పార్టీల నేతలు సిఎం దళిత సాధికారత అంశాన్ని ప్రశంసిస్తూ..మాట్లాడారు. దళిత సాధికారత కోసం, సీఎం కెసిఆర్ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం..సంతోషాన్ని కలిగిస్తున్నదని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో, వారి కుటుంబానికి సహాయం చేస్తూ, సీఎం కెసిఆర్ తక్షణ స్పందన,తీసుకున్న నిర్ణయాలు, దళిత సమాజం లో ఆత్మస్థైర్యాన్ని పెంచిందన్నారు. దళిత సాధికారత కోసం, ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు చిత్త శుద్ది తో అమలు పరచాలని, ప్రభుత్వానికి తమ పార్టీ తరఫున సంపూర్ణ సహకారం వుంటుందని తమ్మినేని స్పష్టం చేశారు.

సీపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. “దళిత సాధికారత కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం, అటువంటి ఆలోచన చేయడం సంతోషంగా ఉందని ప్రశంసించారు. సీఎం కెసిఆర్ 2003లోనే దళిత సాధికారంత కోసం సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలను చర్చించడం నాకు గుర్తున్నది. ప్రభుత్వం అమలుపరుస్తున్న కళ్యాణ లక్ష్మి వంటి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నాయి” అని అన్నారు.

మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కెసిఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రిజర్వేషన్లు పెట్టి దళితులను ఆదుకున్న మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని సీఎం కెసిఆర్ సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని మోత్కుపల్లి అన్నారు. అఖిలపక్షాన్ని పిలిచి మా ఆత్మగౌరవాన్ని గుర్తించి ఆనందం కలిగించినందుకు సిఎం కెసిఆర్ కు  ధన్యవాదాలు తెలిపారు. మరియమ్మ విషయంలో తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయనీ, దళితుల్లో సిఎం మీద విశ్వాసం పెరిగిందని సీఎం కెసిఆర్ ను అభినందించారు. దళితుల కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. యాదగిరి గుట్టను ప్రపంచం గుర్తించే రీతిలో తీర్చిదిద్దుతున్నందుకు, అక్కడి నుంచి ఐదు సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా సీఎం కెసిఆర్ కు మోత్కుపల్లి కృతజ్ఞతలు   తెలిపారు . రైతుబంధు పథకం లాగా దళారీలు లేకుండా నేరుగా ఆర్థిక సహాయం అందించడం వల్ల దళితులు సంతోషిస్తారన్నారు. గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత దళిత విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించటం, వారి ఆకాంక్షలు నెరవేరుతుండటం అంతులేని ఆనందాన్నిస్తోందని మోత్కుపల్లి ఉద్వేగానికి లోనయ్యారు. ఎస్సీల గురించి ఇంతగా తపించే మీకు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని సీఎం కెసిఆర్ ను ఉద్దేశించి అన్నారు.

          దళితుల అభివృద్ధికి నిర్వారామ కృషి చేస్తున్నసీఎం కెసిఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ యంత్రాంగ పై కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. “దళితుల కోసం తెచ్చిన స్కీమ్ లను పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా వుండడం అవసరం. సీఎం గారి నిర్ణయాన్ని అధికారులు పటిష్టంగా అమలు చేస్తారనే విశ్వాసం మాకుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. మరియమ్మ విషయంలో దళిత సమాజానికి ఒక భరోసాను, ధైర్యాన్ని సీఎం కెసిఆర్ అందించారని భట్టి అన్నారు.  పోలీసుల ప్రవర్తనలో ఇకనైనా మార్పు రావాలని అన్నారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎంను కోరారు. దళిత సాధికారత పథకం ద్వారా, నేరుగా ఆర్థిక సాయం అందిస్తే దళితులు వారి అభివృద్ధి ని వారే నిర్ణయించుకోగలుగుతారని ఆయన అన్నారు. అసైన్డ్ భూములను వెనక్కు తీసుకోవడం కంటే, భూమి విలువను నిర్ధారించి, ఆమేరకు కంపెనీల్లో రైతులకు షేర్ల ద్వారా వాటా ఇవ్వాలి సూచించారు.

ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహించటంతో పాటు, దళితుల మీద దాడులు జరిగితే సహించమనే రీతిలో కార్యాచరణ చేపట్టి, దళితుల్లో మరింతగా ధైర్యం నింపాలని అఖిలపక్ష భేటిలో కమ్యూనిస్టు పార్టీ నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరారు.  అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత అఘాయిత్యాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, వారికి రక్షణ చర్యలు ప్రకటించాలని సీఎం కెసిఆర్ ను దళిత సంఘాల నేతలు కోరారు.

 దళితుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణను ప్రశంసిస్తూ సీపిఎం నేత వెంకట్ పలు సూచనలు చేశారు.  దళితులకు భూమికి బదులు భూమినే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ గురుకులాలు ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగున్నాయని అన్నారు. దళిత విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.  దళితులందరికీ నివాస ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వటంతో పాటు, దళిత కాలనీల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ల అభిప్రాయాలను సిఎం కెసిఆర్ పేరు పేరు నా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సామాజిక రాజకీయ ఆర్దిక సాంస్క్రతిక రంగాల్లో దళితుల అభివృద్ధి కోసం వారు విలువైన సూచనలు చేశారు. వాటిని అధికారులు సిఎం ఆదేశాల మేరకు నోట్ చేసుకున్నారు. దళితుల సాధికారత కోసం సిఎం తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని వారు ముక్త కంఠంతో అభినందించారు. సిఎం కు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్