Monday, November 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంజనం నాడి తెలిసిన అన్నాదురై

జనం నాడి తెలిసిన అన్నాదురై

Special Story On Tamil Nadu’s First Political Stalwart CN Annadurai :

అరిజ్ఞర్ అణ్ణాగా పిలువబడిన రచయిత, డిఎంకె వ్యవస్థాపకుడు, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి కీర్తిశేషులైన అణ్ణాదురై గురించి కొన్ని విషయాలు…..

1963లో ఆయన పార్లమెంట్ సభ్యుడు. చెన్నై మాగాణానికి తమిళనాడు అనే పేరు పెట్టాలని కోరికను సభముందుంచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత తెలిపింది. ఎం. ఎన్. లింగం అనే సభ్యుడు తమిళనాడు అని పేరు మార్చడం వల్ల మీకేం లాభం అని అడిగారు. అప్పుడు అణ్ణాదురై రాజ్యసభ, లోక్ సభ, రాష్ట్రపతి వంటి పేర్ల మార్పువల్ల ఎవరికి ఏ లాభం చేకూరిందని ఎదురు ప్రశ్నించారు. ఇందుకు కాంగ్రెస్ సభ్యుల నించి ఎటువంటి జవాబూ లేదు.

అణ్ణాదురై రచయితే కాక మంచి నటుడుకూడా. తాను రాసిన చంద్రోదయం, చంద్రమోహన్ వంటి నాటకాలలో ఆయన నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. విశేష జనాదరణ పొందిన “శివాజీ కండ ఇందూ సామ్రాజ్జియం” (శివాజీ కన్న హిందూ సామ్రాజ్యం) అనే నాటకంలో నటించేందుకు ఎంజీఆర్ ఒప్పుకున్నారు. కానీ ఎందుకో అందులో ఆయన నటించకపోవడంతో తన ఇంట ఉంటున్న “గణేశన్” అనే అతనిని కథానాయకుడి పాత్రలో నటింపచేసారు అణ్ణాదురై. ఆ నాటకానికి విశేష ప్రాధాన్యం దక్కింది. అన్ని విధాల విజయవంతమైంది.political stalwart CN Annaduraiఓరోజు ఆ నాటకాన్ని తిలకించేందుకు పెరియార్ (ఈ.వీ. రామస్వామి నాయకర్) వచ్చారు. ఆ నాటకాన్ని చూసిన పెరియార్ “రెండున్నర గంటలపాటు సాగిన నాటకంలో నేను గణేశన్ ని చూడలేదు. శివాజీని చూసాను” అని గణేశన్ నటకౌశలాన్ని ప్రశంసించారు. ఆ నటుడే తర్వాతి రోజుల్లో నడిగర్ తిలగం శివాజీగణేశన్ గా తమిళ సినీరంగంలో చరిత్ర సృష్టించారు.

రాజకీయాలతో ఎప్పుడూ బిజీగా గడిపే అణ్ణాదురైలో ఓ సృష్టికర్త కూడా ఉన్నారు.సభలూ సమావేశాలకూ వెళ్ళి ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా తన డైరీలో బొమ్మలు గీయడం, జోకులు రాయడం మానేవారుకాదు. ఈ విధంగా ఆయన మానసిక ఒత్తిడిని తగ్గించుకునే వారు.

ఉద్యమాలు చేసి అరెస్టయినప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు తనను చూడటానికి వచ్చేవారిని అణ్ణాదురై అడిగే విషయం – పుస్తకం. అలాగే రాసుకోవడానికి తెల్ల కాగితాలు. బొమ్మలు గీసుకునేవారు. యుద్ధ వీరుడి బొమ్మలూ వనాలూ ఎక్కువగా గీసేవారు.

అణ్ణాదురైకి నశ్యం పీల్చే అలవాటుండేది. ఆయనలో తాను ఆస్వాదించిందేమిటని అడగ్గా ఎంజీఆర్ “బహిరంగ సభలలో ఎవరికీ తెలీకుండా నశ్యంపీల్చే తీరు చూసి తీరాల్సిందే” అన్నారు.

రాత్రిపూట ఎక్కువ సేపు రాయడం, మాట్లాడటం ఆయనకు అలవాటు. దాంతో ఉదయం పది అయినా నిద్ర లేచే వారు కాదు. కాంచీపురంలో ఆయనను చూడటానికి వచ్చేవారు వాకిట్లో నిరీక్షించేవారు. వారిని చూసి ఆయన పిన్ని “ఉదయసూర్యుడు అనే చిహ్నాన్ని పార్టీ గుర్తుగా చేసుకున్నాడే కానీ వీడు ఒక్కరోజైనా ఉదయించిన సూర్యుడిని చూడటం లేదర్రా” అని అంటుండేవారు. ఆమె మాటలతో అక్కడ నవ్వులు విరిసేవి.

1968లో ఓ వైద్యకళాశాల విద్యార్థికీ, బస్సు డ్రైవరుకీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ రవాణా సంస్థ సమ్మెకు దారి తీసింది. అణ్ణాదురై జోక్యం చేసుకున్నా సమస్య కొలిక్కి రాలేదు. విద్యార్థుల తరఫున అణ్ణాదురై క్షమాపణ చెప్పినా రవాణా సంస్థ వారు తమ పట్టు వీడలేదు. ఈ చర్చల మధ్య అణ్ణాదురై సొమ్మసిల్లి పడిపోయారు. నోట్లో నుంచి రక్తం వచ్చింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చేసిన పరీక్షలో ఆయనకు క్యాన్సర్ సోకినట్టు తేలింది.

నటుడు ఎన్. ఎస్. కృష్ణన్ కి, అణ్ణాదురైకి మధ్య మంచి స్నేహమే ఉంది. ఎన్. ఎస్. కృష్ణన్ కోసం అణ్ణాదురై నల్ల తంబి అనే కథను రాసారు. కథ ప్రకారం ఎన్.ఎస్.కృష్ణన్ కి జోడీగా ఒకే హీరోయిన్. ఆ పాత్రలో నటించడానికి భానుమతిని ఎన్నుకున్నారు. ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఒకరోజు అణ్ణాదురై ఎన్. ఎస్. కె. ఇంటికి వెళ్ళారు. అప్పుడే ఆయనకో విషయం తెలిసింది. ఎన్.ఎస్. కృష్ణన్ భార్య మధురం. భర్తతో కలిసి ఈ సినిమాలో నటించలేకపోయానే అని ఆమె బాధపడింది. అయితే ఆ రాత్రే అణ్ణాదురై ఆమె కోసం ఆ సినిమాలో ఓ పాత్ర సృష్టించారు. ఆమె తన భర్తకు జంటగా నటించారు మధురం. దీంతో ఈ చిత్ర కానుకగా ఎన్.ఎస్.కె అణ్ణాదురైకి ఓ కారు కానుకగా ఇచ్చారు. అప్పట్లో పెట్రోల్ సంక్షోభం ఉండటంతో ఎన్.ఎస్.కె ఆ సమస్య తలెత్తకుండా అణ్ణాదురైకి పెట్రోల్ టోకెన్లు ఇచ్చారు.

వారసత్వ రాజకీయాలకు అణ్ణా బహుదూరం. ఆయనకంటూ కన్నబిడ్డలు లేకున్నా నలుగురిని దత్తతు చేసుకున్నారు. కానీ వారినెవరినీ రాజకీయాల్లోకి రానివ్వలేదు. పార్టీ వ్యవహారాలలోకి జోక్యం చేసుకోనిచ్చేవారు కాదు.

చదువు సంధ్యలు కానిచ్చిన తర్వాత తాను చదువుకున్న పచ్చయప్ప హైస్కూల్లో ఇంగ్లీష్ టీచరుగా పని చేశారు. కొంత కాలానికే ఆయన జర్నలిస్టుగా, రచయితగా కొనసాగారు. జస్టిస్ మ్యాగజైన్ వంటి కొన్ని పత్రికలకు, అలాగే కుడి అరసు వంటి వారపత్రికలకు సంపాదకుడిగా పని చేశారు.

1909 సెప్టెంబర్ 15న జన్మించిన అణ్ణాదురై 1969 ఫిబ్రవరి మూడో తేదీన కన్నుమూశారు. ఆయన అంతిమయాత్రలో పదిహేను మిలియన్లమంది పాల్గొనడం గిన్నిస్ వరల్డ్ రికార్డు పుటలకెక్కింది.political stalwart CN Annaduraiఅణ్ణాదురై పుట్టి పెరిగిన కాంచీపురంలోని ఆయన నివాసాన్ని 1980 లో ఆయన స్మారకనివాసంగా ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అలనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. “ఓ సామాన్యమైన ఇంట పుట్టిపెరిగిన ఒకరు తర్వాతి కాలంలో ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది ప్రజాస్వామ్యానికి అద్దం పట్టిందని అన్నారు. నేను అణ్ణా అంతలా చదువు కోకపోయినప్పటికీ సామాన్యుడనైన నేనూ రాష్ట్రపతి అయ్యానంటే అందుకు కారణం ప్రజాస్వామ్య వ్యవస్థే” అని ఆయన అన్నారు. బహుశా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండిన ఒక నాయకుడి నివాసాన్ని స్మారకమందిరంగా దేశ రాష్ట్రపతి ప్రారంభించడం అనేది ఇదే మొదటిసారి కావచ్చు అని నీలంగారు అన్నారు.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్