లాటిన్ అమెరికాలోని కొలంబియాలో ఎన్నికైన తొలి వామపక్ష అధ్యక్షుడు గుస్తావ్ పెట్రో,తొలి ఆఫ్రో-కొలంబియన్ ఉపాధ్యక్షురాలు ప్రాన్సియా మార్ఖ్వెజ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజధాని బగోటాలో దాదాపు లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగిన కార్యక్రమానికి స్పెయిన్ రాజు ఆరవ పెతిలిపే, తొమ్మిది లాటిన్ అమెరికా దేశాధినేతలు వచ్చారు. దేశంలో తీవ్రమైన అవినీతి, అసమానతలు, మాదక ద్రవ్యమాఫియాలు, శాంతి కోసం సాయుధ పోరాటాన్ని విరమించిన గెరిల్లాలు జనజీవన స్రవంతిలో కలవటం వంటి అనేక సవాళ్ల మధ్య గుస్తావ్ పెట్రో పాలన ప్రారంభమైంది. బలమైన, ఐక్య కొలంబియా లక్ష్యమని…రెండు సమాజాల మాదిరి రెండు దేశాలను తాను కోరువటం లేదని తన తొలి ప్రసంగంలో పెట్రో స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాదిరిగానే వెనెజులాతో సరిహద్దును తెరిచే ప్రక్రియ సాగుతోందని మంగళవారం గుస్తావ్ పెట్రో వెల్లడించారు. ఏడు సంవత్సరాల క్రితం రెండు దేశాల మధ్య సంబంధాలు రద్దయ్యాయి. వెనెజులా ప్రభుత్వ వ్యతిరేకులకు కొలంబియాలో ఆశ్రయం కల్పించారు. తిరుగుబాటు నేత గుయిడోకు అక్కడ ఒక ఎరువుల కంపెనీ కూడా ఉంది. కేవలం 50.42శాతం ఓట్లతో అధికారానికి వచ్చిన పెట్రోకు దేశంలోని పచ్చి మితవాదులు, కార్పొరేట్‌లతో పాటు అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్రల నుంచి అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఐదు కోట్ల మంది జనాభాలో సగం మంది దారిద్య్రంలో ఉన్నందున వారి ఆకలి తీర్చటం తన ప్రధాన కర్తవ్యంగా పెట్రో చెప్పాడు.
దానికి గాను ధనికుల నుంచి అదనపు పన్ను వసూలు చేసేందుకు పన్ను సంస్కరణలను ప్రవేశపెడతామని ఆర్ధిక మంత్రి జోస్ ఆంటోనియో ఒకాంపా చెప్పాడు. దేశంలో మాదక ద్రవ్యాల ముఠాలు విచ్చలవిడిగా పెరిగేందుకు కారణమైన కోకా ఆకుల సాగు నుంచి రైతులను వేరే పంటల సాగుకు మళ్లించేందుకు గ్రామీణ ప్రాంతాలలో పెట్టుబడులు పెడతామని పెట్రో భరోసా ఇచ్చాడు. విశ్వవిద్యాలయ విద్య ఉచితంగా అందిస్తామని, ఆరోగ్య, పెన్షన్ సంస్కరణలు తెస్తామని వాగ్దానం చేశాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాళ్ల నుంచి చమురు, గాస్ తీయటాన్ని, కొత్తగా చమురుబావుల వృద్ది నిలిపివేస్తామని ప్రకటించాడు.
ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో సగం చమురు పరిశ్రమ నుంచే ఉన్నాయి. ఎఫ్‌ఏఆర్‌సి గెరిల్లాలతో కుదిరిన ఒప్పందంలోని అంశాలనే నేషనల్ లిబ రేషన్ ఆర్మీ సంస్థ తిరుగుబాటుదార్లకూ వర్తింప చేస్తామని గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతామని పెట్రో వాగ్దానం చేశాడు. నయా ఉదారవాద ప్రయోగశాలగా, వాటి అమలుకు నియంతలను ప్రోత్సహించిన ప్రాంతంగా లాటిన్ అమెరికా ఉన్న సంగతి తెలిసిందే. వాటిని వ్యతిరేకిస్తున్న జనం అనేక అనుభవాలను చూసిన తరువాత వామపక్ష భావజాలం ఉన్న వారిని ఎన్నుకుంటున్నారు. శతాబ్దాలు, దశాబ్దాల తరబడి ఉన్న పార్టీలను పక్కన పెడుతున్నారు. కొలంబియాలో కూడా అదే జరిగింది.