ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ మిలిటెంట్ల మూవ్ మెంట్ పెరిగిందని, దీనిపై తన వద్ద స్పష్టమైన సమాచారం ఉందని టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం తన భద్రత అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని… కొంతకాలంగా తాను రాస్తున్న లేఖలు, వెలుగులోకి తెస్తున్న అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయని, అందుకే తనను లక్ష్యంగా చేసుకొని ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తనపై ఓ మానసిక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, తాను రాజకీయాల్లో రాటుదేలానని ఈ విషయం గుర్తుంచుకోవాలని అధికార పార్టీకి హితవు పలికారు. ఆర్ధిక అంశాలు, గంగవరం పోర్టు, అదానీ కంపెనీతో విద్యుత్ ఒప్పందం లాంటి అంశాల్లో తాను గట్టిగా మాట్లాడుతున్నానని… ప్రజల కోసం పని చేస్తున్నానని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నక్సలైట్ల బాధిత రాజకీయ కుటుంబంలో తమది మొదటి స్థానంలో ఉంటుందన్నారు.
మూడు నెలల నుంచి తన సెక్యూరిటీ పై విచిత్రమైన వాదనలు చేస్తున్నారని, తన గన్ మెన్ ను ఏపీ బోర్డర్ వద్దే వదిలి వెళ్లాలని, వేరే రాష్ట్ర తీసుకు వెళ్ళవద్దని చెప్పారని కేశవ్ చెప్పారు. అదే సమయంలో తన పర్సనల్ గన్ లైసెన్స్ ను ఏపీ వరకే పరిమితంగా ఉందని, దాన్ని అల్ ఇండియా పర్మిట్ కోసం దరఖాస్తు చేస్తుకుంటే ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు, జీవో 655 ప్రకారం సెక్యూరిటీ ఇవ్వాలని, అంతే తప్ప కేశవ్ ఒక్కడి విషయంలోనే ప్రత్యేక రూల్స్ ఏమిటని ప్రశ్నించారు. తనపై కేసు పెట్టాలని కూడా జగన్ ప్రభుత్వం చూస్తోందని చెప్పారు.
తన విషయంలో మూడు అంశాలు ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు ఓ అధికారి సమాచారం ఇచ్చారని… దీని ప్రకారం మొదటిది తన సెక్యూరిటీ అంశంలో గందరగోళం ఉంటుందని, రెండవది తనపై కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నం చేయడం అని… కేశవ్ వివరించారు. సెక్యూరిటీ విషయంలో జరిగిందని, అదే విధంగా కేసు కూడా నమోదు చేయబోతున్నట్లు తెలిసిందని… మూడవది ఏమిటనేది కేసు నమోదయిన తరువాత చెబుతానన్నారు.
Also Read : కేశవ్ కు భద్రత కల్పించాలి: అచ్చెన్నాయుడు