బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను బీజేపీలోని కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బండి సంజయ్ కి చెప్పే దళిత సమావేశానికి హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు. సీఎం ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి వెళ్ళి బీజేపీని బతికించానన్న మోత్కుపల్లి ప్రగతి భవన్ సమావేశానికి వెళ్ళకుంటే బీజేపీ కి తీవ్ర అపవాదు వచ్చేదన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీ పైనున్న ముద్రను పోగొట్టే ప్రయత్నం చేశాను.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నాకు ఫోన్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళకుండా ఎలా ఉంటానన్న నర్సింహులు సమావేశానికి వెళ్ళాను కాబట్టే దళితుల సమస్యలపై మాట్లాడగలిగానన్నారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన దళిత సాధికారత మీద సమావేశం చారిత్రాత్మకమైనదని ప్రశంసించారు. వ్యాపారాల కోసం పార్టీలు మారే వ్యక్తులతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేనని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేను దగ్గరవ్వలేదు.. దూరమూ జరగలేదన్నారు. స్వలాభం కోసం పార్టీలు మారను. నేను బీజేపీలోనే ఉన్నాను.. ఉంటానని మోత్కుపల్లి తేల్చి చెప్పారు. మోడీ నాయకత్వం లోనే పని చేస్తున్న, చేస్తానన్నారు. సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే ప్రశ్నిస్తానన్నారు. బీజేపీ పార్టీ వ్యక్తిగానే అఖిల పక్ష సమావేశానికి వెళ్ళానన్న మోత్కుపల్లి పార్టీ చర్య తీసుకుంటానంటే అప్పుడు చూద్దామన్నారు.