Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎన్నికల చుట్టూ రాజకీయాలు

ఎన్నికల చుట్టూ రాజకీయాలు

Elections-Emotions: ముత్యాల ముగ్గు సినిమాలో ఓ డైలాగు ఉంది…. “సెక్రెట్రీ.. ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా….మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా”….అని.. అలాగే ప్రభుత్వాలు  ఎప్పుడూ ఎన్నికల  మీదే కాకుండా ప్రజల సమస్యలపై కూడా శ్రద్ధ పెట్టాలి.

ఎనిమిదేళ్లుగా ఈ దేశంలో ఎప్పుడూ ఎన్నికలు… రాజకీయాలే తప్ప కీలక అంశాలపై దృష్టి సారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూ వస్తున్నాయి. ఇది దేశ, రాష్ట్రాల భవిష్యత్తుకి తీవ్ర అవరోధంగా పరిణమించే ప్రమాదం కనబడుతోంది. అందులోనూ దేశంలో మీడియా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడం… వీటిలో చాలా వరకూ ఏదో ఒక పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతుగా నిలబడడం వల్ల… మీడియా కూడా రాజకీయాలను, ఆయా పార్టీల అజెండాలను శాసించడం మొదలు పెట్టింది.  కొన్నిసార్లు విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా మీడియా అజేండానే పాటించాల్సిన దుస్థితి కూడా వచ్చింది.

ఒకప్పుడు ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడి, నాలుగేళ్ల పాలన పూర్తయిన తరువాతే ఎన్నికల హడావుడి మొదలయ్యేది.  ఆ సమయంలోనే రాబోయే ఎన్నికల కోసం అధికారంలో ఉన్న పార్టీ కొత్త పథకాలు ప్రవేశ పెట్టడం, వాటికి ధీటుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తమ మేనిఫెస్టోకు రూపకల్పన చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది. 2014 తరువాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదంతో…. దేశం మొత్తాన్నీ కాషాయీకరించడమే లక్ష్యంగా తన పని మొదలు పెట్టింది. ఆ దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్య ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాల మినహా మిగిలిన చోట్ల ఈ యాత్ర సవ్యంగానే సాగుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో  మెజార్టీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి జన్మతః సంక్రమించిన అసమ్మతి- అలకలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోంది.

ఒకప్పుడు ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అది పక్క రాష్ట్రానికి ఏమాత్రం సంబంధంలేని అంశంగా ఉండేది. ఇప్పుడు దేశంలో ఏ ఎన్నిక జరిగినా… అది ఉప ఎన్నిక అయినా కూడా…. జాతీయ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికగానే మారింది.  ప్రతి ఏటా కనీసం మూడు సార్లు దేశంలో ఎక్కడో చోట ఎన్నికలు రావడం, ఆ రాష్ట్రం చుట్టూనే దేశ రాజకీయాలు మొత్తం తిరిగడం సర్వ సాధారణమైపోయింది. ఫలితాలు రాగాలే వాటి సాకుతో మరో నెల కాలం గడుస్తోంది. మరో నెల తర్వాత మరో ఎన్నిక… ఇలా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గత కొంత కాలంగా ఎన్నికల రాజకీయాల చుట్టూనే తిరుగుతూ వస్తోంది. మధ్యలో ఓ రెండేళ్ల కాలాన్ని కరోనా మింగేసింది.

పరిపాలన, ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడం, నిరుద్యోగం,  విద్య, వైద్యం లాంటి కనీస అవసారాల కల్పన లాంటి అంశాలపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత  ‘కేంద్ర నిధులు’ ఓ వివాదాస్పద అంశంగా తయారైంది.  చాలా పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తమ పథకాలుగా చెప్పుకుంటున్నాయని విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బిజెపి నేతలు గగ్గోలు పెడుతుంటే, రాష్ట్రాలు పన్నుల కడితేనే కదా మీరు పంచుతున్నారనే వాదన ఆయా పార్టీలు చేస్తున్నాయి

కేంద్రంలో ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ళ పాలనా కాలంలో …. పేదరికంతో కొట్టు మిట్టాడుతున్న సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే ఏ ఒక్క పథకాన్నీ తీసుకు రాలేకపోయింది.  రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తేనో, ముద్ర లోన్లు ఇస్తేనో పేదరిక నిర్మూలన సాధ్యం కాదు కదా! ప్రజలకు ఉపాధి చూపించే మార్గాలపై దృష్టి పెట్టాలి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, కరోనా తర్వాత నిరుద్యోగం పెరిగిపోవడం, ఆర్ధిక సంక్షోభంతో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగుల జీతాలు పెంచాలేకపోవడంతో మధ్యతరగతి, సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం అవసరం అనుకున్నప్పుదల్లా భావోద్వేగ అంశాలను తెరపైకి తెచ్చి, వాటి చుట్టూనే ప్రజలను తిప్పుతోంది. తెలుగు రాష్ట్రాల సంగతి సరే సరి… ప్రభుత్వాలు ప్రజాకర్షక పథకాలు, భారీ ప్రాజెక్టుల మైకంలో మౌలిక అంశాలను మరచిపోతున్నాయి.  అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.

మరో రెండ్రోజుల్లో జాతి యావత్తూ 75 ఏళ్ళ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటున్న వేళలో.. ఫెడరల్ స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. పరస్పర విమర్శలు, ప్రతిపక్షాల నిర్మూలన, ఎన్నికలు, భావోద్వేగాల చుట్టూనే సమాజాన్ని తిప్పడం ఏమాత్రం ఉపయోగం కాదు, రాబోయే రోజుల్లో ఇది ప్రజల్లో తీవ్ర అసహనానికి దారి తీసే ప్రమాదం ఉంది.  ఎప్పుడూ ఎన్నికలు, ఉచితాలు, తాత్కాలిక కార్యక్రమాలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. ధరల నియంత్రణ, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి. ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో తీసుకు రావాలి.

ప్రత్యామ్నాయం లేక ప్రజలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకే తిరిగి అధికారం ఇస్తూ ఉండొచ్చు, అంతమాత్రాన ఆయా ప్రభుత్వాల విధానాలను ప్రజలు సమర్ధిస్తున్నట్లు కాదు…. ఈ విషయం అధికారంలో ఉన్న పార్టీలు గుర్తుంచుకోవాలి.

పార్టీలు గెలుస్తున్నది విపక్షాలమీద… ప్రజల మీద కాదు!

-అభిజ్ఞ

Also Read :

పెద్దవారి పిల్లలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్