అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలోనే దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి, ఓ వర్గం మీడియా పథకం ప్రకారం, తప్పుడు ప్రచారం చేస్తోందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలో 34వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే… తమ ప్రభుత్వం రెండేళ్ళలోనే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించిందని సజ్జల తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, నాడు-నేడు కార్యక్రమం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని, ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి ఉత్తమమైన విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమన్నారు.
మన విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీ పడేలా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సజ్జల వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుల భర్తీ ఉంటుందని సజ్జల పేర్కొన్నారు. 2014-19లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారనే విషయాన్ని ఇదే ఈనాడు ఎందుకు అప్పుడు బ్యానర్ స్టోరీలుగా రాయలేదని ప్రశ్నించారు. విషం కక్కడమే ఎల్లో మీడియా ఎజెండా అని, ఉద్యోగాల భర్తీపై ఎల్లో మీడియా రాస్తున్న తప్పుడు కథనాలను నమ్మొద్దని సజ్జల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.