బిజెపి పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలలోనూ ఎంపీ లక్ష్మణ్ కు అవకాశం కల్పించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం జాతీయ నాయకత్వం సీరియస్ గా దృష్టి కేంద్రీకరించింది అనేందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపులను బిజెపి వైపు తిప్పుకునేందుకు ఉపయోగపడుతుందనే వాదన ఉంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ కుమార్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం గమనార్హం.
బిజెపి చేరికల కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను ఎంపిక చేయటం ద్వారా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని తెరాస నుంచి బిజెపికి దగ్గర చేయాలనే కోణం గోచరిస్తోంది. యాదవ వర్గానికి చెందిన కాసం వెంకటేశ్వర్లుకు ఇటీవలే పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. త్వరలోనే బీసీల్లో ఇతర సామాజిక వర్గాల వారికి బిజెపి సముచిత స్థానం కల్పించనుందని విశ్వసనీయ సమాచారం.