Saturday, November 23, 2024
HomeTrending Newsఅంబేద్కర్ ఓవర్సీస్ పై టిడిపి దుష్ప్రచారం: మేరుగ

అంబేద్కర్ ఓవర్సీస్ పై టిడిపి దుష్ప్రచారం: మేరుగ

విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. అవాస్తవాలు అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజలను గందరగోళానికి గురి చేసి తద్వారా రాజకీయంగా లాభం పొందాలని చూసే చంద్రబాబు నాయుడు, పచ్చ పార్టీ నేతలు ఇప్పుడు మరో కొత్త అబద్దాన్ని ప్రచారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు హయాంలో  పెట్టిన ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి’ పథకానికీ, ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇవి రెండు వేర్వేరు పథకాలని, వీటి  నియమాలు, విధి విధానాలు వేర్వేరని చెప్పారు.  అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కేవలం ఎస్సీలు, ఎస్టీలకు మాత్రమే చెందింది కాగా… జగనన్న విదేశీ వసతి దీవెన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలతో పాటుగా ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి కూడా ఉద్దేశించినదని తెలిపారు.

అంబేద్కర్ ఓవర్సీస్ విద్య నిధి పథకం కేవలం 15 దేశాలకు మాత్రమే వర్తించిన పథకమని, ఈ పథకం ద్వారా  ఏడాదికి ఎస్సీల్లో 300 మందికి. ఎస్టీలలో 100 మందికి మాత్రమే అవకాశం కల్పించే పరిమితమైనదన్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన  ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో 1 నుంచి 200 వరకూ క్యూఎస్ ర్యాంకులు కలిగిన యూనివర్సిటీలన్నింటికీ వర్తిస్తుందని,  ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాలకు చెందిన వారు ఎంత మంది అర్హత సాధిస్తే అంతమందికీ కూడా విదేశీ విద్యను అందించే పథకమని నాగార్జున వివరించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య నిధి అనేది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించే పథకం అని తెలిపారు. జగనన్న  విదేశీ విద్యా దీవెన పథకం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాలకు చెందిన పిల్లలు ఎవరైనా క్యూ.ఎస్ ర్యాంకింగ్ లో 1 నుంచి 100 లోపు ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే కోటి రూపాయలైనా సరే ఆ ఫీజు మొత్తాన్ని నూటికి నూరు శాతం రీయంబర్స్ మెంట్, అలాగే క్యూ.ఎస్. ర్యాంకుల్లో 101 నుంచి 200 లోపు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే 50 లక్షల రుపాయల దాకా ఫీజు రీయంబర్స్ మెంట్ చేసే పథకమని స్పష్టం చేశారు.  అంబేద్కర్ పథకం 6 లక్షల రుపాయలకు లోపు ఆదాయం కలిగిన వారికి మాత్రమే లబ్ధికలిగించేదని, తాము తెచ్చిన పథకం 8 లక్షల రుపాయల దాకా ఆదాయం ఉన్న వారికి కూడా విదేశీ విద్యను అభ్యసించే అవకాశం ఉందన్నారు.

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, పైరవీలు, సిఫార్సులకు వీలు లేని విధంగా, ప్రతిభ కలిగిన పేద పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎంతైనా ఖర్చు పెట్టే విధంగా, పేదరికంలో ఉన్న వారు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ప్రతి ఒక్కరికీ అవకాశం అందే విధంగా సిఎం జగన్ ఎంతో విశాలధృక్పధంతో దూరదృష్టితో రూపొందించి అమలు చేయాలని నిర్ణయించిన కొత్త పథకం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ అని మంత్రి విశ్లేషించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్