గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ బైటపెట్టిన ఫోరెన్సిక్ నివేదిక ఫేక్ అని తేలినందున దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫేక్ వీడియో ఫేక్ రిపోర్టుతో తెలుగుదేశం పార్టీ అనైతిక రాజకీయానికి పాల్పడిందని, వెంటనే టిడిపి నేతలపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, ఆ వీడియోను ప్రచారం చేసిన మీడియాపైనా చర్య తీసుకోవాలని కోరారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత మీడియాతో మాట్లాడారు.
ఈ అంశంలో చంద్రబాబు తన పార్టీ వారితో ప్రెస్‌మీట్‌లో అడ్డగోలుగా మాట్లాడించారని, వారు మృగాల్లా వ్యవహరించారని, ఆరోజు పిచ్చిపిచ్చిగా మాట్లాడిన అనిత, పట్టాభిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక ఫేక్ వీడియో సృష్టించి, దాన్ని లండన్‌కు పంపి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఐ-టీడీపీ ద్వారా దాన్ని అప్‌లోడ్ చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, ఆ తర్వాత వీడియోను అమెరికాలోని ఒక ల్యాబ్‌కు పంపామని, ఆ వీడియో వాస్తవమని నివేదిక వచ్చిందంటూ పూర్తిగా అబద్ధాలు చెప్పారని ఆమె దుయ్యబట్టారు.
ఎక్లిప్స్ ల్యాబ్ ప్రతినిధి జిమ్స్ స్టాఫోర్డ్ ఆ మేరకు ఇక్కడి సీఐడీ పోలీసులకు లేఖ పంపారని, దీనితో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో దుర్మార్గమైన రీతిలో రాజకీయం చేస్తుందన్నది అందరికి అర్ధమవుతుందన్నారు. మీకు పచ్చ మీడియా ఉందని చెప్పి, ఏ మాత్రం స్పృహ లేకుండా, ఇలాంటి ఫేక్ వీడియోలు రూపొందించి, ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు. చివరకు కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతున్నారని, స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని, అతి త్వరలో చంద్రబాబు రాజకీయంగా పూర్తిగా కనుమరుగవుతుందన్నారు.