పేస్ రికగ్నిషన్ యాప్ ను అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసే యోచన ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మొదటగా విద్యా శాఖలో దీన్ని ప్రవేశ పెట్టామని, దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయన భరోసా ఇచ్చారు. ఈ యాప్ విషయంలో తలెత్తిన సందేహాలు, అభ్యంతరాలపై ఉపాద్యాయ సంఘాలతో బొత్స సమావేశమై చర్చించారు. సమాచార లోపం వల్లే ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, ఒక నిమిషం లేట్ గా వస్తే అబ్సెంట్ వేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, మూడు సార్లు ఆలస్యంగా వస్తే నాలుగో సారి హాఫ్ డే లీవ్ గా పరిగణిస్తామని చెప్పారు.
ఇప్పటికే లక్షా 96 వేల మంది ఉపాధ్యాయులు ఈ యాప్ ను వినియోగిస్తున్నారని, మిగిలిన వారు కూడా ఈ నెలాఖరులోగా డౌన్ లోడ్ చేసుకోవాలని బొత్స సూచించారు. ఈనెల 27,28 తేదీల్లో ఉపాద్యాయ సంఘాలతో మరోసారి సమావేశమవుతామని చెప్పారు. ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగమని, వారు ఎదుర్కొనే ఇబ్బందులను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త విధానం తీసుకు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు సహజమని అన్నీ త్వరలోనే సమసిపోతాయని అయన ఆశాభావం వ్యక్తం చేశారు.