మరోసారి అధికారం రాదని తెలిసే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను సిఎం జగన్ కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, ఉపాధి కల్పన శూన్యమని, దీనిపై నిరుద్యోగులు, యువతలో అశాంతి నెలకొందని, బాధిత ప్రజలే వైసీపీకి రాబోయే రోజులల బుద్ధి చెప్పడం ఖాయమని యనమల హెచ్చరించారు.
మరో రెండేళ్లలో జగన్ పదవీకాలం పూర్తయ్యేనాటికి ఏపీ అప్పులు రూ.10లక్షల కోట్లకు చేరే ప్రమాదం ఉందని, వాటికి చెల్లించాల్సిన వడ్డీ భారమే ఏడాదికి రూ.లక్ష కోట్లు వరకూ ఉండే అవకాశం ఉందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లెక్కాపత్రం లేని అప్పులు ఏపీలో అగ్నికి ఆజ్యం అయ్యాయని, ఏపీ ఆర్ధిక బరితెగింపుపై కేంద్రం ఇంకెన్నాళ్లు రాష్ట్రాన్ని హెచ్చరిస్తుందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలుకన్నా సాక్షిలో వాటి ప్రకటనలకే సిఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు.