ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాము ప్రజల కోసం పోరాడుతుంటే పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని, ప్రభుత్వాన్ని నిలదీస్తే జేసీబీ ద్వారా ఇళ్ళు కూలుస్తున్నారని విమర్శించారు. సిఎం జగన్ జేసీబీ మోహన్ రెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు.
పలాసలో టిడిపి నేత సూర్య నారాయణకు సంఘీబావం తెలిపేందుకు వెళుతున్న లోకేష్ ను పోలీసులు శ్రీకాకుళంలో అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడకు వెళ్ళడం కుదరదని తేల్చారు. లోకేష్ ను అదుపులోకి తీసుకొని విశాఖకు తరలించారు అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. పలాసలో 27వ వార్డు ఉల్లసపేటలో నలబై ఏళ్ళుగా నివసిస్తున్నవారికి 2001లో చంద్రబాబు హయంలో పట్టాలు ఇచ్చారని, ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఆ వార్డులో తమ పార్టీ అభ్యర్ధి గురిటి సూర్యనారాయణకు ఘన విజయం సాధించారని లోకేష్ చెప్పారు. దీనిపై కక్ష గట్టిన మంత్రి అప్పలరాజు వారి ఇళ్ళను కూల్చి వేసేందుకు జేసీబీలు పంపారని, దాన్ని అడ్డుకున్న తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
లోకేష్ మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు అక్కడకు చేరుకొని అడ్డుకున్నారు. దీనిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను మాజీ మంత్రినని, ఎమ్మెల్సీగా ఉన్నానని ఇలా అడ్డుకోవడం తగదని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడడం కూడా నేరమేనా అని ప్రశించారు, రాజ్యాంగం తనకిచ్చిన హక్కులను అడ్డుకోవడానికి మీరేవరంటూ మండిపడ్డారు.
Also Read : నేతన్న సంక్షేమంలో కోత: లోకేష్