Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్WI-NZ: వన్డే సిరీస్ కూడా కివీస్ దే

WI-NZ: వన్డే సిరీస్ కూడా కివీస్ దే

వెస్టిండీస్ తో ఆ దేశంలో జరిగిన వన్డే సిరీస్ ను కూడా న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్ లో విండీస్ కూడా ధాటిగా ఆడి రాణించినప్పటికీ కివీస్ బ్యాట్స్ మెన్ సమిష్టిగా రాణించి మరో 17 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లతో విజయంతో పాటు సిరీస్ కూడా గెల్చుకున్నారు.

బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, విండీస్ తొలి వికెట్ కు 173 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేసింది. షాయ్ హోప్ 100 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్ తో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే స్కోరు వద్ద మరో ఓపెనర్ కేల్ మేయర్స్ కూడా 110 బంతుల్లో 12 ఫోర్లు, 3సిక్సర్లతో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నికోలస్ పూరన్ ఓవైపు సహచారులంతా వెనుదిరుగుతున్నా ధాటిగా ఆడి 55 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 91 పరుగులు చేసి ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. చివర్లో అల్జారీ జోసెఫ్ కేవలం 6 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 301పరుగులు చేసింది.

కివీస్ బౌలర్లలో బౌల్ట్ మూడు; శాంట్నర్ రెండు; సౌతీ, ఫెర్గ్యూసన్, నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో కివీస్ 20పరుగులకే తొలి వికెట్ (ఫిన్ అల్లెన్-3) కోల్పోయింది. మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్-57;  డెవాన్ కాన్వే-56; కెప్టెన్ టామ్ లాథమ్-69; డెరిల్ మిచెల్-63 పరుగులతో రాణించారు. ఈ దశలో జేమ్స్ నీషమ్ సత్తా చాటి కేవలం 11 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లతో 34 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో 47.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసి విజయం సాధించింది.

విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, యన్నిక్ కరియా చెరో రెండు; అల్జారీ జోసెఫ్ ఒక వికెట్ పడగొట్టారు.

కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…. మిచెల్ శాంట్నర్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.

విండీస్ తో జరిగిన టి 20సీరీస్ ను 2-1తో గెల్చుకున్న కివీస్, ఈ మ్యాచ్ విజయంతో వన్డే సిరీస్ ను కూడా 2-1తో దక్కించుకుంది.

Also Read : NZ Vs WI: చివరి టి-20లో విండీస్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్