Sunday, November 24, 2024
HomeTrending Newsబాధితులను ఆదుకోండి : బాబు

బాధితులను ఆదుకోండి : బాబు

కరోనా ఎన్నో కుటుంబాల్లో తీవ్ర ఆవేదన మిగిల్చిందని, కొన్ని కరోనా మరణాల గురించి విన్నప్పుడు మనసు కలచి వేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమత్రి జగన్ కు బాధితుల ఆవేదన, ఆక్రందన వినబడే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సిఎంగా ఉన్నప్పుడు బయో టెక్నాలజీ పార్కు, జినోమ్ వ్యాలీకి తానే శ్రీకారం చుట్టానని, దానిలో భారత్ బయో టెక్ కంపెనీ వచ్చిందని, ఆ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తుంటే, దానికి కూడా కులం అంటగట్టిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కుతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

కోవిడ్ మృతుల కుటుంబాలను  ఆదుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ‘సాధన దీక్ష’ పేరిట టీడీపీ నిరసన కార్యక్రమం పట్టింది. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు, టిడిపి సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రతి నిరుపేద కుటుంబానికి పది వేల రూపాయల ఆర్ధిక సాయం అందించాలని, జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లకు, నిర్మాణ కార్మికులకు, చిరు వ్యాపారులకు రూ. 10 వేలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, ఆక్సిజన్ అందక మరణించిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. కరోనా నియంత్రణకు తాను కొన్ని సలహాలు ఇస్తే అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచాన్ని కరోనా భయభ్రాంతులకు గురిచేసిందని, అగ్ర దేశాలు కూడా దీని దెబ్బకు వణికి పోయాయని బాబు వివరించారు, కరోనా తీవ్రత గురించి తాను ముందేచెప్పినా ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోలేదని, పారాసెటమాల్ వేసుకుంటే తగ్గి పోతుందంటూ నిర్లక్ష్యం చేశారని బాబు గుర్తు చేశారు. కరోనా విషయంలో సలహాలు చెబితే తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టారని, అధికార పార్టీ నేతలు మాత్రం ఊరేగింపులు చేశారని విమర్శించారు.

మహిళల రక్షణకు కొత్త చట్టాలు అవసరం లేదని, ఉన్న చట్టాలు సక్రమంగా అమలు చేస్తే సరిపోతుందని… ఇదే విషయాన్ని తాను అసెంబ్లీలో ప్రభుత్వానికి సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. అసలు చట్టం ఆమోదం కాక ముందే పోలీస్ స్టేషన్, వాహనాలు, మళ్ళీ ఇప్పుడు యాప్ ప్రారంభం అంటూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని బాబు అన్నారు,  ముఖ్యమంత్రి ఇల్లు, డిజిపి ఆఫీసుకు కూత వేటు దూరంలోనే సీతానగరం సంఘటన జరిగితే ఇంతవరకూ దోషులను పట్టుకోలేకపోయారని, మళ్ళీ ఇప్పుడు దిశా యాప్ పేరుతో హడావుడి చేస్తున్నారని, మన సాధన దీక్షను పక్కదారి పట్టించడానికే ఈ కార్యక్రమం ఇవాళ పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్