రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందని, నాడు-నేడు ఎంత ముఖ్యమో స్కూళ్ల నిర్వహణ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై అధికారుతో సిఎం జగన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…
- స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణలో హెచ్ఎం, గ్రామ సచివాలయ సిబ్బందిది కీలకపాత్ర
- స్కూళ్లకు, అంగన్వాడీలకు బియ్యాన్ని సరఫరాచేసేముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలి
- సరఫరా చేసే బియ్యం బ్యాగులపై మధ్యాహ్నం భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలి
- ఆహారాన్ని రుచిగా వండడంపై కుక్స్ కు తగిన తర్ఫీదు ఇవ్వాలి
- నాడు – నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్ చేయించాలి
- నిర్దేశించుకున్న అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? లేవా? ఏమైనా సమస్యలు వచ్చాయా? అనే అంశాలను పరిశీలించాలి
- ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వాడుకుని సమస్యలను పరిష్కరించాలి
- నాడు– నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో భద్రతకోసం వాచ్మెన్ నియమించాలి
- అంతిమంగా కలెక్టర్లు, జేసీలు… స్కూళ్ల నిర్వహణపై బాధ్యత వహించాలి, దీనికోసం ఓ కాల్సెంటర్నునిర్వహించాలి
- స్కూళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదన్న మాట రాకూడదు
- వైయస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్ కార్యక్రమంపైనా కూడా గట్టి పర్యవేక్షణ ఉండాలి
- ఖాళీగా ఉన్న అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీచేయాలి
ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కే వి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ సిరి, సెర్ఫ్ సీఈఓ ఏ.ఎండి ఇంతియాజ్, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ డిస్ప్లేలు:సిఎం