తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే చాలా భాద కలుగుతుందని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి..ఆ చిచ్చులో చలి కాచుకుంటున్నరని విమర్శించారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బెరులో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల పాలక, విపక్షాలపై దుమ్మెత్తిపోశారు. తెలంగాణ మంచి రాష్ట్రం ఎన్నో మతాలకు,ఎన్నో సంప్రదాయాలకు నిలయమైన రాష్ట్రమని, ఇలా ప్రశాంతంగా ఉంచడం బీజేపీ కి ఇష్టం లేదని విమర్శించారు.
బీజేపీ ఒక మత పార్టీ…మత పిచ్చి ఉన్న పార్టీ అని రుజువు అయ్యిందని, మతం పేరు చెప్పి రాజకీయం చేస్తారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడని మాటలు విన్నామని, ఎమ్మెల్యే అంటే ఒక నియోజక వర్గ ప్రజల అందరికీ ప్రతినిధి అన్నారు. రాజసింగ్ మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం సరి కాదన్నారు. ఆయన మీద ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది క్లారిటీ లేదని షర్మిల విమర్శించారు. బీజేపీ సస్పెండ్ చేశాం అంటుంది..షో కాజ్ నోటీస్ ఇచ్చాం అంటుందని, సస్పెండ్ చేశాం అంటే బీజేపీ క్లియర్ గా చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీస్ అంటే వివరణ ఇచ్చుకో అని చెప్తున్నారా..గతంలో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడుగా ఉండి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మసీదులు తవ్వుకుంటూ పోదాం… శవాలు వస్తె మీవి…శివ లింగాలు వస్తె మావి అన్నారని, బీజేపీ సంజయ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాజ సింగ్ గతంలో కూడా వివాదాస్పద మాటలు మాట్లాడారని,బీజేపీకి ఓట్లు వేయక పోతే బుల్డోజర్ తో నాశనం చేస్తా అని అన్నారు
గతంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలా మాట్లాడుతున్నారని, ఓల్డ్ సిటీలో మళ్ళీ చిచ్చు పెడుతున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మంటలో చలి కాచుకుంటున్నారని, ఇదేనా బీజేపీకి చేతనైన రాజకీయమని ప్రశ్నించారు. గవర్నర్ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని, స్పీకర్ రాజసింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇటువంటి వాళ్ళను సమాజం సహిస్తే గొడవలు పెరుగుతూ ఉంటాయన్నారు. కేసీఅర్ ముస్లీంలను ఘోరంగా మోసం చేశారని, 12శాతం రిజర్వేషన్లు పెంచుతాం అని ఫెయిల్ అయ్యారన్నారు. కవిత లిక్కర్ వ్యాపారాన్ని మళ్లించడానికి కేసీఅర్ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని, రాజసింగ్ వెనుక కేసీఅర్ ఉన్నాడు అని చర్చ జరుగుతోందని ఆరోపించారు. డైవర్షన్ స్కీమ్ కింద రాజసింగ్ ఎపిసోడ్ తీసుకొచ్చారు అని అనుమానం వ్యక్తం చేశారు.
Also Read : చర్లపల్లి జైలుకు ఎమ్మెల్యే రాజాసింగ్