తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సంజయ్ చేస్తున్న పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం గురువారం సస్పెండ్ చేసింది. పోలీసులు ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని.. ఈనెల 23న పోలీసులు నోటీసులు ఇచ్చారు. జనగామ జిల్లాలో పాదయాత్రకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పాదయాత్రలో విద్వేషపూరిత కామెంట్స్ చేస్తున్నారని.. ఇతర జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నారని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
సభల్లో రెచ్చగొట్టే ప్రకటనలు.. ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో.. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలన్నారు. దీంతో తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు.. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో బండి సంజయ్ ఈ రోజు(శుక్రవారం) నుంచి మళ్ళీ పాదయాత్రకు సిద్ధమయ్యారు.
మరోవైపు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభపై ఉత్కంఠ నెలకొంది. రేపటి హనుమకొండ బిజెపి బహిరంగసభకు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వకపోవటంతో… సభ నిలిపివేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహించి తీరుతామని కమలం నేతలు ప్రకటించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే.. అవసరమైతే న్యాయస్థానం అనుమతితో బహిరంగసభ నిర్వహించి తీరుతామని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read : దేశంలో ఫెయిల్యూర్ సీఎం కేసీఆర్ బండి సంజయ్