మావోయిస్టులు ఒకే రోజు రెండు లేఖలు విడుదల చేయటం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న తెలంగాణలో నక్సల్స్ కార్యకలాపాలు ఇటీవల పెరిగాయి. తాజాగా మునుగోడు ఉపఎన్నికలు, తెరాస, బిజెపి లను టార్గెట్ చేస్తూ మావోలు హెచ్చరికలు జారీ చేశారు. మునుగోడు ఉపఎన్నికపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట.. ఆ లేఖ ఉంది. అధికారం కోసం బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతోందని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. వ్యాపారం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి బీజేపీ అవసరమైందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింలను అవమానించేలా ఉన్నాయని లేఖలో వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లంచగొండి, కుటుంబ పాలన వల్లే తెలంగాణలో బీజేపీ ముందుకు వచ్చిందని.. మావోయిస్టు నేత జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రజా వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పీడన వ్యవస్థలను నిర్మూలించాలని సూచించారు.