విభజన హామీల అమలు కోసం సదరన్ కౌన్సిల్ సమావేశంలో ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా కూడా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిపై ప్రస్తావిస్తూ, పరిష్కారంకోసం దృష్టిపెట్టాలని కోరారు. సెప్టెంబరు 3న కేరళ రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి భేటీ జరగనుంది. దీనిలో చర్చించాల్సిన అంశాలపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది.
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ వర్ధంతి సందర్భంగా తాను ఈ సమావేశాలకు హాజరుకావడం లేదని, ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందం హాజరవుతుందని సిఎం తెలిపారు. రాష్ట్రం తరఫున 19 అంశాలను అజెండాలో ఉంచారని అధికారులు చెప్పారు.
సమావేశంలో సిఎం చేసిన సూచనలు
- విభజన సమస్యలపై పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాలి
- ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపించడమే కాకుండా తీసుకున్న నిర్ణయాలను అమలుచేసేదిగా ఉండాలంటూ గట్టిగా డిమాండ్ చేయాలి
- విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయింది
- విభజన సమస్యలు పరిష్కారంలో ఆలస్యం అవుతున్నకొద్దీ… రాష్ట్రానికి తీవ్రంగా నష్టమే జరుగుతోంది
- అందుకే వీటి పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి
- పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి తగిన నిధులు విడుదల చేసే అంశాన్నికూడా అజెండాలో ఉంచాలి
ఈ సమావేశంలో విద్యుత్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక, ప్రణాళిక, శాససనభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : ఇంటింటా వెలుగులు నింపాలనే: సిఎం